Share News

విశాఖ జోరు

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:26 AM

విశాఖపట్నం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. మాటల ప్రభుత్వం పోయి...చేతల ప్రభుత్వం వచ్చింది.

విశాఖ జోరు

  • ఉందిలే మంచికాలం ముందు ముందునా...

  • జిల్లాకు రానున్న రోజుల్లో భారీగా పరిశ్రమలు, ఐటీ సంస్థలు, పర్యాటక ప్రాజెక్టులు

  • మూడు నెలల్లో టీసీఎస్‌ ప్రారంభం

  • భవనాలు/భూముల అన్వేషణలో గూగుల్‌

  • స్టీల్‌ప్లాంటుకు త్వరలో భారీ ప్యాకేజీ

  • కైలాసగిరిపై త్వరలో గ్లాస్‌ బ్రిడ్జి

  • బీచ్‌రోడ్డులో హెలికాప్టర్‌ మ్యూజియం

  • సిరిపురంలో ఐటీ కాంప్లెక్స్‌

  • రైల్వే జోన్ కార్యాలయానికి త్వరలో శంకుస్థాపన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. మాటల ప్రభుత్వం పోయి...చేతల ప్రభుత్వం వచ్చింది. ఆరు నెలల్లోనే ప్రజల ఆశలకు రెక్కలు తొడిగింది. యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంది. ఒకటి, రెండు కాదు...2025లో అనేకం సాకారం కానున్నాయి.

త్వరలోనే టీసీఎస్‌ ప్రారంభం

విశాఖలో పెద్ద ఐటీ కంపెనీ లేదనే కొరతను తీర్చడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌)ను రప్పించారు. ఆ సంస్థ స్వల్పకాలంలో ఆపరేషన్లు ప్రారంభించేందుకు వీలుగా రుషికొండలో డల్లాస్‌ టెక్నాలజీస్‌ కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. మూడు నెలల్లో అది కళకళలాడనుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్‌ విశాఖలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు అంగీకరించింది. వారి ప్రతినిధులు నగరంలో పర్యటించి భూములు, భవనాలు పరిశీలించారు. ఇది కూడా త్వరలోనే రానున్నది. విశాఖ గ్లోబల్‌ ఐటీ హబ్‌గా మారడానికి ఈ రెండూ దోహదపడతాయి.

స్టీల్‌ప్లాంటుకు మంచి రోజులు

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు కేంద్రం భారీ ప్యాకేజీని ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇది ఉద్యోగులు ఊహించని స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

పర్యాటకానికి వంతెనలు

పర్యాటక రంగాన్ని ఉరకలెత్తించడానికి కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ గ్లాస్‌ బ్రిడ్జి నిర్మిస్తోంది. అలాగే ఆర్‌కే బీచ్‌లో విఫలమైన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని రుషికొండ బీచ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌కే బీచ్‌ రోడ్డులోని నేవల్‌ మ్యూజియం కాంప్లెక్స్‌లో అదనంగా యుహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌ చేరనుంది. 2025లో మొదట విశాఖ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఇదే అవుతుంది. వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో రూ.100 కోట్లతో నిర్మించిన మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం కూడా కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో ఐటీ కంపెనీలు రానున్నాయి. నగరంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ట్రాఫిక్‌ సిగ్నళ్లు కూడా 2025లోనే పనిచేయనున్నాయి.

మెడికల్‌ టెక్నాలజీ యూనివర్సిటీ

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో మెడికల్‌ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకానుంది. అందులో మెడికల్‌ టెక్నాలజీతో కూడిన ఎంబీఏ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు వస్తాయి. విశాఖను ఇది వైద్య రంగంలో మరో మెట్టు పైకి తీసుకువెళుతుంది.

రైల్వే జోనల్‌ కార్యాలయం

ఎప్పటి నుంచో ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోనల్‌ కార్యాలయం నిర్మాణానికి అతి త్వరలో శంకుస్థాపన జరగనుంది. వీలైతే ఈ భవనం నిర్మిస్తూనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రూ.14 వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి.

అందుబాటులోకి రుషికొండ భవనం

రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన పర్యాటక భవనం ఖాళీగా ఉంది. దానిని ఎక్కువ కాలం అలా ఉంచకుండా సరైన వాటికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ పక్కాగా కుదిరితే అందులో కొత్త కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

రూ.30 కోట్లతో ఎస్‌టీపీఐ ఇంకుబేషన్‌ సెంటర్‌

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆ హబ్‌ సమీపాన ఎకరా స్థలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) రూ.30 కోట్లతో ఇంకుబేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి వారం రోజుల క్రితమే శంకుస్థాపన చేసింది. దీనిని ఏడాదిలోగా పూర్తిచేస్తామని ప్రకటించింది. దీని ద్వారా విశాఖ యువతకు కొత్త టెక్నాలజీలలో శిక్షణ లభించనుంది.

Updated Date - Jan 01 , 2025 | 01:26 AM