మళ్లీ వైరస్ టెన్షన్
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:41 AM
కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కావడంతో కేంద్రం అలర్ట్
సీఎం టెలీ కాన్ఫరెన్స్
తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు
కేజీహెచ్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్న అధికారులు
ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
కరోనా వైరస్ పుట్టిన చైనా నుంచి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన కొద్దిరోజులుగా చైనాలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కూడా సోమవారం మూడు కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో కేజీహెచ్‌లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసుకోవాలని అధికారులకు సమాచారం అందింది. క్యాజువాలిటీపైన మొదటి అంతస్థులో 20 పడకలతో వార్డును సిద్ధం చేస్తున్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవీ లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం, దురద వంటి లక్షణాలు ఉంటాయి. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, హెచ్‌ఐవీ, కేన్సర్, కీళ్లవాతం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి, స్టెరాయిడ్స్ వినియోగించే వారికి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తుంపర్ల ద్వారా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందిలో సాధారణ ఫ్లూ మాదిరిగా వచ్చి తగ్గుతుందని పేర్కొంటున్నారు. బ్రాంకైటిస్, న్యుమోనియా, ఆస్తమా ఉన్న వారిలో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుందంటున్నారు. మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం కీలకమని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..జాగ్రత్తలు అవసరం
- డాక్టర్ కె.రాంబాబు, విమ్స్ డైరెక్టర్
దేశంలో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ వైరస్ కూడా కరోనా జాతికి చెందినదే. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా పిల్లల్లో, 65 ఏళ్లు దాటిన వారిలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఈ వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందే అవకాశం లేదు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలి. పానిక్ కావద్దు. అనుమానాలు, భయాలను పెట్టుకోవద్దు.