ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే విజయం
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:13 AM
ఉత్తరాంధ్ర పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది ఫలితం ఆది నుంచి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే నిర్ణయమవుతోంది.

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆది నుంచి అదే వరుస
2007లో శాసన మండలి పునరుద్ధరణ తరువాత నాలుగుసార్లు ఎన్నికలు
ప్రతిసారీ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో అభ్యర్థులకు దక్కిన విజయం
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుది ఫలితం ఆది నుంచి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే నిర్ణయమవుతోంది. శాసన మండలిని 2007లో పునరుద్ధరించిన తరువాత ఇప్పటివరకూ నాలుగుసార్లు చొప్పున పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా...ప్రతిసారి రెండో ప్రాధాన్య ఓట్లతోనే అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు.
మండలి పునరుద్ధరణ తరువాత తొలిసారి 2007లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎంవీఎస్ శర్మ రెండో ప్రాధాన్య ఓటుతోనే విజయాన్ని దక్కించుకున్నారు. అనంతరం 2011లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంవీఎస్ శర్మ, 2013లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులునాయుడు రెండోసారి రెండో ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందారు. 2017లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీఎన్ మాధవ్, 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మ రెండో ప్రాధాన్య ఓటుతో గెలిచి మండలిలో అడుగుపెట్టారు. అలాగే, 2023లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓట్లతోనే విజయాన్ని దక్కించుకోగా, తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె మూడోసారి రెండో ప్రాధాన్య ఓటుతో విజయాన్ని సాధించారు.
రుషికొండ బీచ్‌లో పూణే బృందం తనిఖీలు
‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు పునరుద్ధరణకు ఈ బృందం ఇచ్చే నివేదికే కీలకం
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో సరైన వసతులు, పరిశుభ్రత లేని కారణంగా ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించిన నేపథ్యంలో పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగాంగా పూణేకు చెందిన సంస్థ రోయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ మంగళవారం బీచ్‌కు వచ్చి తనిఖీలు నిర్వహించింది. ఇక్కడ బీచ్‌లో పర్యాటకులు మునిగిపోతే ఎలా రక్షిస్తారు?...అనే అంశంపై లైఫ్‌గార్డులను అడిగి తెలుసుకుంది. వారికి వృత్తిపరమైన అవగాహన ఉందా?, లేదా? అని పరీక్షించింది. ఇంకా మరో రెండు ఇతర అంశాలను కూడా పరిశీలించనున్నది. వీరు సమర్పించే నివేదిక ఆధారంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం రాక
నేటి నుంచి నగరంలో రహస్యంగా పర్యటన
పారిశుధ్య నిర్వహణ, చెత్త తరలింపు వంటివి పరిశీలన
జీవీఎంసీ అధికారులు అప్రమత్తం
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛ సర్వేక్షణ్-2024 సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందం మంగళవారం రాత్రి నగరానికి చేరుకుంది. బుధ లేదా గురువారం నుంచి నగరంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి వాటిని బృందం పరిశీలించనున్నది. అలాగే పలు ప్రాంతాల్లోని నివాసాలు, మార్కెట్‌లకు వెళ్లి అక్కడ జీవీఎంసీ పారిశుధ్య నిర్వహణ తీరు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు, వ్యాపారుల నుంచి అభిప్రాయాలను సేకరించన్నది. స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలను కూడా ప్రజలను అడిగే అవకాశం ఉంది.
ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే బృందం తమ పర్యటన వివరాలను జీవీఎంసీ అధికారులకు కూడా వెల్లడించదు. తాము సర్వే చేసిన ప్రాంతంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతోపాటు తాము పరిశీలించిన ప్రాంతంలోని పరిస్థితులు, పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలపై నివేదికను తయారుచేసి జీవీఎంసీ అధికారుల ధ్రువీకరణతో ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు పంపిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం రాక నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరిగేలా, రోడ్లు శుభ్రంగా ఉండేలా, డ్రైనేజీల్లో డీసిల్టేషన్ పనులు సవ్యంగా సాగేలా, డ్రైనేజీ పాడైపోయిన చోట పునర్నిర్మాణం వెంటనే చేపట్టేలా ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.