Share News

కైలాసగిరిపై కలకలం

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:14 AM

కైలాసగిరిపై శుక్రవారం ఉదయం దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి.

కైలాసగిరిపై కలకలం

  • దట్టమైన పొగలు రావడంతో ఏం జరిగిందోనని ఆందోళన

  • చెత్తకుప్పకు నిప్పు పెడితే పక్కనున్న పాత టైర్లకు అంటుకున్న మంటలు

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరిపై శుక్రవారం ఉదయం దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక శకటం వెళ్లి మంటలను అదుపుచేసింది. ఆ తరువాత వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోప్‌వే ఆగేచోట ఎండుటాకులు కుప్పగా ఉండడంతో అక్కడి సిబ్బంది వాటికి మంట పెట్టి విధుల్లోకి వెళ్లిపోయారు. ఆ మంటలు పక్కనున్న పాత టైర్లకు అంటుకోవడంతో దట్టమైన పొగలు పైకి ఎగిశాయి. రోప్‌వేలో చక్రాలకు ఉపయోగించే టైర్లు అరిగిపోయాక పక్కన పడేస్తుంటారు. చెత్తకుప్ప పక్కనే అవి ఉండడంతో అంటుకుని మంటలు పెద్దవయ్యాయి. ఈ విషయం గుర్తించి రోప్‌ వే కాంట్రాక్టర్‌ను కమిషనర్‌ మందలించారు. ఇచ్చిన స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, మళ్లీ మంటలు పెడితే ఉపేక్షించబోమని, దీనికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత ఆయన కైలాసగిరి మొత్తం తిరిగి అవసరమైనచోట్ల ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ సెక్రటరీ మురళీకృష్ణ, ఇంజనీరింగ్‌ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ అధికారులకు ఆదేశించారు.

Updated Date - Mar 08 , 2025 | 01:14 AM