Share News

వైసీపీలో కలకలం

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:16 AM

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వైసీపీని కుదిపేస్తోంది.

వైసీపీలో కలకలం

  • పార్టీ విశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనతో నేతలు, కార్యకర్తల్లో విస్మయం

  • వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆయనదే పెత్తనం

  • ఆరోపణలు అనేకం

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వైసీపీని కుదిపేస్తోంది. పార్టీలో నంబరు-2గా వ్యవహరిస్తూ ఢిల్లీలో చక్రం తిప్పిన సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నానని శుక్రవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చకు దారితీసింది. నిజంగా రాజీనామానా?, లేక తెర వెనుక ఏమైనా డ్రామా ఉందా?...అని పలువురు సంశయం వ్యక్తంచేస్తున్నారు.

కాకినాడ పోర్టు లావాదేవీల్లో విజయసాయి రెడ్డి వియ్యంకుడి కంపెనీ అయిన అరబిందో ఫార్మా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం, అది అటు తిరిగి..ఇటు తిరిగి పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉండడంతో ఏకంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది.

విశాఖలో ఆయన చెప్పిందే వేదం

వైసీపీ అధికారంలోకి రాక ముందే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు తలకెత్తుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగింది. మంత్రులు ఉన్నా వారికి ఎటువంటి విలువ దక్కలేదు. విశాఖలో జగన్‌ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేసి, కేసులు పెట్టి వేధించారు. దసపల్లా భూములను ప్రభుత్వ జాబితా నుంచి తప్పించారు. విశాఖ-భోగాపురం కోస్టల్‌ కారిడార్‌ను దారిమళ్లించారు. భీమిలి ప్రాంతంలో యజమానుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా భూములను కొనుక్కున్నారు. సింహాచలం దేవస్థానం చైర్మన్‌ అశోక్‌గజపతిరాజును పక్కనపెట్టి ఆయన సోదరుడు ఆనందగజపతి కుమార్తె సంచయితను ఢిల్లీ నుంచి తీసుకువచ్చి చైర్‌పర్సన్‌ను చేసి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టారు. చాలామందిని భయపెట్టి పార్టీ మారేలా చేశారు.

2024 ఎన్నికలకు ఏడాది ముందు సాయిరెడ్డిని ఇక్కడి నుంచి తప్పించి వైవీ సుబ్బారెడ్డిని ఇన్‌చార్జిగా వేశారు. పార్టీ ఓడిపోవడంతో సాయిరెడ్డికి జగన్‌ మళ్లీ విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్య రెండు, మూడుసార్లు నగరానికి వచ్చి పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఆయనతో నాటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీ వంటి వారికి పొసిగేది కాదు. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనేది. ఇదిలావుండగా పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతుండడంతో నాయకులు, కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడారి ఆనందకుమార్‌లు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..

వైసీపీకి బొడ్డేటి కాశీ రాజీనామా

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బొడ్డేటి కాశీ విశ్వనాఽథం (కాశీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యసభకు, పార్టీకి రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేసిన కొద్ది గంటలకే కాశీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాశీ ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. బీచ్‌రోడ్డులో గోకార్టింగ్‌ ట్రాక్‌ ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆర్థికంగా దెబ్బతీయడానికి యత్నించారు. ఈ క్రమంలో కాశీ గోకార్టింగ్‌ను నేలమట్టం చేశారు. దాంతో కాశీ తన వ్యాపార అవసరాల కోసం వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన కూడా రాజీనామా చేసేశారు.

Updated Date - Jan 25 , 2025 | 01:16 AM