Share News

ఉపమాక వెంకన్న ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:22 AM

సమష్టిగా పనిచేసి ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.

 ఉపమాక వెంకన్న ఉత్సవాలను విజయవంతం చేయాలి
ఉపమాక ఉత్సవ ఏర్పాట్లపై చర్చిస్తున్న హోం మంత్రి అనిత

హోం మంత్రి అనిత

నక్కపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సమష్టిగా పనిచేసి ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలోశనివారం సాయంత్రం ఈ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. నియోజకవర్గం కూటమి నాయకులతో ఈ సందర్భంగా మాట్లాడారు. టీటీడీ ఉత్సవాలకు సహకరిస్తుందన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. స్థానిక పంచాయతీ సహా ఇతర పంచాయతీల శానిటేషన్‌ సిబ్బందిని ఉత్సవాలకు నియమిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాలు ముగిసే వరకూ ఆలయ పరిధిలో ఎటువంటి వాహనాలను అనుమతించరాదని, తాను కూడా ఆలయ ముఖ ద్వారం నుంచి నడిచివస్తానని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపాలని సూచించారు. తాను సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లను ఆహ్వానించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున మార్చి 10వ తేదీన స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తానని చెప్పారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదన్నారు. వీఐపీలకు నిర్దేశిత సమయంలోనే దర్శన సదుపాయం కల్పించాలని సూచించారు. ఉత్సవాలను ఈ ఏడాది ప్లాస్టిక్‌, పాలిథిన్‌ రహితంగా చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాదాచార్యులు, స్థానిక సర్పంచ్‌ ప్రగడ వీరబాబు, కూటమి నాయకులు కొప్పిశెట్టి కొండబాబు, గెడ్డం బుజ్జి, శివదత్‌, పెంకులరాజు, కురందాసు నూకరాజు, దేవర సత్యనారాయణ, వైబోయిన రమణ, అయినంపూడి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:22 AM