ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:15 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజున నామినేషన్లు పరిశీలిస్తారు.

షెడ్యూల్ విడుదల
వచ్చే నెల మూడో తేదీన నోటిఫికేషన్
పదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ
27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో సుమారు 23 వేల మంది ఓటర్లు
అమలులోకి ఎన్నికల కోడ్
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేక్
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజున నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ తుదిగడువు. వచ్చే నెల 27వ తేదీ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో స్కూలు అసిస్టెంట్లు, అంతకంటే పైకేడర్ అంటే హెచ్‌ఎంలు, జూనియర్, సీనియర్ లెక్చరర్లు, వర్సిటీ అధ్యాపకులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సెకండరీ విద్య బోధన చేసే టీచర్లు ఓటర్లుగా ఉంటారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదుకు గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అవకాశం ఇచ్చారు. నవంబరు 23న ముసాయిదా, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. తుది జాబితాలో 21,555 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,948 మంది పురుషులు, 8,607 మంది మహిళలు. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరం జిల్లాలో 4,937, పార్వతీపురం మన్యంలో 2,262, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448, విశాఖపట్నం జిల్లాలో 5,277, అనకాపల్లి జిల్లాలో 2,802 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత కూడా ఓటు నమోదుకు అవకాశం ఇవ్వడంతో మరో 1,000 మంది వరకు పెరిగారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఎన్నికల అధికారిగా, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్ సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహారించనున్నారు.
అమల్లోకి ఎన్నికల కోడ్
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో కోడ్ అమలులోకి వచ్చింది. మార్చి ఎనిమిదో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. బుధవారం నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించకూడదు. ఈ ప్రభావం గురువారం కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి ఉంటుంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన రూ.11,444 కోట్ల ప్యాకేజీపై కర్మాగారం అధికారులు, ఉద్యోగుల సమక్షంలో ఉక్కు మంత్రి అధికారికంగా ప్రకటన చేయాలనుకున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉక్కు కర్మాగారంలో పర్యటించవచ్చునని, కానీ...హామీలు, అభివృద్ధి పథకాలపై ప్రకటన చేయరాదని అంటున్నారు. అదేవిధంగా ఆంధ్ర వైద్య కళాశాల సెంటినరీ బ్లాక్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నెల నాలుగో తేదీన రావల్సి ఉంది. ఆ కార్యక్రమం వాయిదా పడింది. సుమారు ఐదు వారాలపాటు ముఖ్యమంత్రి, మంత్రుల అధికార పర్యటనలు ఉండవని అధికారులు తెలిపారు.