ఎగువశోభలో అసంపూర్తి భవనాలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:47 PM
మండలంలోని ఎగువశోభ పంచాయతీలో ప్రభుత్వ భవనాలు కరువయ్యాయి. ఇప్పటికీ పక్కా భవనాలు లేకపోవడంతో ఉద్యోగులు, సమస్యలు విన్నవించేందుకు వచ్చే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లర్లకే పరిమితమైన ఆర్‌బీకే, వెల్‌నెస్ సెంటర్లు
అందుబాటులోకి రాని సచివాలయం భవనం
గత ప్రభుత్వంలో బిల్లులు మంజూరుకాకపోవడంతో పనుల్లో జాప్యం
ఉద్యోగులు, గిరిజనులకు తప్పని ఇబ్బందులు
అనంతగిరి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎగువశోభ పంచాయతీలో ప్రభుత్వ భవనాలు కరువయ్యాయి. ఇప్పటికీ పక్కా భవనాలు లేకపోవడంతో ఉద్యోగులు, సమస్యలు విన్నవించేందుకు వచ్చే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో 2020లో ఎగువశోభ పంచాయతీ కేంద్రంలో రూ.43.6 లక్షలతో సచివాలయం, రూ.24 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో వెల్‌నెస్ సెంటర్ భవనాలు మంజూరయ్యాయి. గత నాలుగేళ్లుగా పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పటికీ భవనాలు అందుబాటులోకి రాలేదు. సచివాలయం వరకు కొంత మేర బిల్లులు మంజూరుకావడంతో కాంట్రాక్టర్ రెండు శ్లాబ్‌లు పూర్తి చేశారు. ప్లాస్టింగ్ పనులు, విద్యుత్, టైల్స్, తదితర పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ నిర్మాణ పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో సచివాలయం పరిఽధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన పంచాయతీ భవనం రేకుల షెడ్డు కావడంతో వర్షాకాలంలో పూర్తిగా కారిపోయి ఉద్యోగులు విధులు నిర్వహించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఈ భవనాలన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తాయని ఉద్యోగులు, గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.