Share News

అవినీతి ఖజానా

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:05 AM

సుమారు రూ.7 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన ట్రెజరీ అధికారులకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అవినీతి ఖజానా

  • ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మళ్లీ పోస్టింగ్‌!

  • కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగంపై రెండేళ్ల క్రితం పాడేరు సబ్‌ ట్రెజరీ అధికారి,

  • ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు సస్పెన్షన్‌

  • ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా నాటి కలెక్టర్‌ ఆదేశం

  • ఆయన బదిలీ కావడంతో మారిపోయిన సీన్‌

  • అక్రమాలే జరగలేదంటూ విచారణ ముగించిన ఖజానా అండ్‌ అకౌంట్స్‌ విభాగం ఉన్నతాధికారులు

  • ముగ్గురికీ విశాఖలో పోస్టింగ్‌

  • పెద్దమొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సుమారు రూ.7 లక్షలు లంచం తీసుకున్నారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన ట్రెజరీ అధికారులకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తం చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలకు 2022లో విద్యుత్‌ అలంకరణ పనులు చేసిన కాంట్రాక్టర్‌ రూ.34.3 లక్షల బిల్లులను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. ఆ బిల్లు (గుర్తింపు నంబర్‌: 1338602) అమరావతిలో సీఎఫ్‌ఎంఎస్‌లో 2022 సెప్టెంబరులో పాసైంది. దీంతో రూ.34.3 లక్షలను పాడేరు సబ్‌ ట్రెజరీలో అదే ఏడాది డిసెంబరులో సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించారు.

రూ.7 లక్షలు లంచం తీసుకున్నారని కలెక్టర్‌ ఫిర్యాదు

బిల్లు రూ.34.3 లక్షలు చెల్లించేందుకు స్థానిక సబ్‌ట్రెజరీ అధికారులు రూ.7 లక్షలు లంచం తీసుకున్నారని సదరు కాంట్రాక్టర్‌ 2023 మార్చి నెలలో అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రూ.4 లక్షలు సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులకు, రూ.3 లక్షలు స్థానిక సబ్‌ ట్రెజరీలో అధికారులు తీసుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాడేరు సబ్‌ట్రెజరీ అధికారులను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తన వద్దకు పిలిపించుకుని ఈ వ్యవహారంపై నిలదీశారు. కాంట్రాక్టర్‌ వద్ద లంచంగా తీసుకున్న రూ.7 లక్షలు తక్షణమే వెనక్కి చెల్లించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. అయితే తాము రూ.7 లక్షలు తీసుకోలేదని, సీఎంఎఫ్‌ఎస్‌ విభాగానికి రూ.4 లక్షలు, సబ్‌ట్రెజరీ మామూళ్లుగా రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు మాత్రమే తీసుకున్నామని కలెక్టర్‌ వద్ద అంగీకరించారు. ఆ రూ.5 లక్షలు బాధితుడికి తిరిగి చెల్లించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అందుకు సబ్‌ట్రెజరీ అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో 2023 మార్చి 13న ఒక సబ్‌ ట్రెజరీ అధికారి, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్‌లను సస్పెండ్‌ చేశారు.

కలెక్టర్‌ మారడంతో సీన్‌ మారింది..

ఖజానా అధికారులపై ఫిర్యాదు చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చిత్తూరుకు బదిలీ కావడంతో మొత్తం సీన్‌ మారిపోయింది. సస్పెన్షన్‌కు గురైన ఎస్‌టీవో, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు ఖజానా అండ్‌ అకౌంట్స్‌ శాఖలో భారీస్థాయిలో పైరవీలు సాగించారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు అధికారులు ఎటువంటి తప్పూ చేయలేదని విచారణలో ధ్రువీకరించడంతోపాటు వారికి నాలుగు నెలల క్రితం విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఒక జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఫిర్యాదు చేసిన వ్యవహారంలో సస్పెండైన అధికారులు ఎటువంటి తప్పు లేదని నిర్ధారించడం, విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 08 , 2025 | 01:05 AM