బొర్రా రోడ్డులో ప్రయాణమంటే హడల్
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:01 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే బొర్రా రోడ్డు గోతులమయంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఎక్కడికక్కడ గోతులు
రైల్వే గేటు సమీపంలో కూలిన రక్షణ గోడ
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
అనంతగిరి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే బొర్రా రోడ్డు గోతులమయంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.
ములియగుడ నుంచి బొర్రా గుహల వరకు ఏడు కిలోమీటర్లు దూరం ఉంటుంది. బగ్మారవలస, దొరగుడ, హోటల్స్ సమీపంలోని రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. రైల్వే గేటు సమీపంలోని రక్షణ గోడ కూలిపోవడంతో వచ్చే వాహనాలు అదుపుతప్పితే సుమారు 80 అడుగుల లోయలోకి దూసుపోయే ప్రమాదం ఉంది. గతంలో రెండు వ్యాన్‌లు బోల్తా పడగా, డ్రైవర్ మృతి చెందాడు. దానికి ముందు లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. ములియుగుడ- బొర్రా వరకు ఉన్న రోడ్డు ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో రోడ్డంతా గోతులమయంగా మారింది. ఈ దారికి కనీసం మరమ్మతులు చేసినా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని స్థానికులు చెబుతున్నారు.