మన్యానికి పర్యాటకుల తాకిడి
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:27 PM
విశాఖ మన్యానికి శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వాతావరణం అనుకూలించడం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

లంబసింగి, అరకులోయల్లో సందడే సందడి
మంచు అందాలను ఆస్వాదించిన సందర్శకులు
రద్దీగా పర్యాటక ప్రాంతాలు
చింతపల్లి/అరకులోయ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విశాఖ మన్యానికి శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వాతావరణం అనుకూలించడం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆంధ్రకశ్మీర్ లంబసింగికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం వ్యూపాయింట్, లంబసింగి జంక్షన్, భీమనాపల్లి, తాజంగి జలాశయాల వద్ద సందడి నెలకొన్నది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద మంచు అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు పర్యాటకులతో రద్దీగా కనిపించారు.
అరకులోయలో పర్యాటకులు సందడి చేశారు. గిరిజన మ్యూజియం వద్ద పర్యాటకులకు పోటెత్తారు. మ్యూజియం ఎంట్రన్స్‌లో ఉన్న ఐలవ్‌యూ అరకు బోర్డు వద్ద ఫొటోలు దిగారు. మ్యూజియంలో బోటు షికారు , జిప్ లైనర్, స్కైసైక్లింగ్ వంటి సాహసక్రీడల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే విధంగా మ్యూజియంలో గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే గ్యాలరీలను సందర్శించారు. అరకులోయకు సమీపంలోని మాడగడ సన్‌రైజ్ హిల్స్‌ను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు. పద్మాపురం గార్డెన్ ఆధునికీకరణ పనులు చేస్తుండడంతో మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు పర్యాటకులను అనుమతించడం లేదు.