కాంట్రాక్టు ఉద్యోగికి పర్యాటక పగ్గాలు!
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:17 AM
అవినీతి, అక్రమాలతో నిండిన పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాలని కూటమి నేతలు కోరుతున్నా పెద్దలు పట్టించుకోవడం లేదు.

జిల్లా పర్యాటక శాఖాధికారిగా గరికిన దాసు
అల్లూరి జిల్లా బాధ్యతలు కూడా అప్పగింత
గైడ్‌గా చేరి డీటీఓ స్థాయికి....
రాష్ట్ట్రంలో పర్యాటకంగా అత్యంత ఆదరణ కలిగిన రెండు జిల్లాలకు ఇన్‌చార్జిగా నియమించడంపై విస్మయం
తీరుమారని పెద్దలు...తప్పుల మీద తప్పులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అవినీతి, అక్రమాలతో నిండిన పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాలని కూటమి నేతలు కోరుతున్నా పెద్దలు పట్టించుకోవడం లేదు. పైగా మరిన్ని తప్పటడుగులు వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పర్యాటక శాఖ అధికారిగా గరికిన దాసును నియమించడమే అందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.
విశాఖపట్నానికి రాష్ట్ర పర్యాటక రాజధానిగా పేరు ఉంది. ఇక పక్కనే ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన అరకులోయ, బొర్రా గుహలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటక శాఖకు అత్యంత ప్రధానమైన ఈ రెండు జిల్లాలకు అధికారిగా ఒక కాంట్రాక్టు ఉద్యోగి (గరికిన దాసు)ని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పర్యాటక శాఖ అధికారి హోదాలో పనిచేయాలని సూచించారు. దాసుది విశాఖపట్నం జిల్లానే. 2004లో గైడ్‌గా పర్యాటక శాఖలో చేరారు. కాంట్రాక్టు ఉద్యోగిగా మారారు. ఆ తరువాత అసిస్టెంట్ టూరిజం అధికారి(ఏటీఓ)గా పదోన్నతి సాధించారు. అక్కడితో ఆగకుండా మేనేజర్ అయ్యారు. ఆ తరువాత ఏకంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి (డీటీఓ)గా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు విజయనగరం జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఉంటూ...అక్కడకు 150 కి.మీ. దూరానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన్ను విశాఖ డీటీఓగా నియమించారు. అల్లూరి జిల్లా అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.
అనేక ఆరోపణలు.. వివాదాలు
దాసు చాలాకాలంగా పర్యాటక శాఖలో పనిచేస్తున్నా ఆయన కాంట్రాక్టు ఉద్యోగి. అలాంటి వ్యక్తికి కీలకమైన రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారంటే ఏమనాలో ఇక్కడి ప్రజా ప్రతినిధులకు అర్థం కావడం లేదు. రుషికొండ బీచ్‌లో ముందు 40 దుకాణాలు ఉండేవి. ఇప్పుడు అవి వందకు పైగా ఉన్నాయి. వీటి సంఖ్య ఇంతలా పెరగడం వెనుక దాసు హస్తం ఉందనేది శాఖలో సిబ్బంది మాట. అదే బీచ్‌లో ఆయన భార్య పనిచేస్తున్నారు. రుషికొండ బీచ్ నిర్వహణ బాధ్యతలను ఇంతకు ముందు ఓ ప్రైవేటు సంస్థ చూసేది. వారు 50 మందిని నియమించుకొని బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచేవారు. అలా అందులో ఒకరిగా చేరిన దాసు భార్య టిక్కెట్ కలెక్షన్ బాధ్యతలు చూసేవారు. ఆరోపణలు రావడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దాంతో ఆ బీచ్‌లో అధికారులకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారైంది. అది దాసుకు అనుకూల వర్గమనే ప్రచారం ఉంది.
ఇదిలావుండగా మంగమారిపేటలో బీచ్‌ను ఆనుకొని పర్యాటక శాఖ స్థలం ఉంది. అక్కడ కూడా అనధికారికంగా చాలా దుకాణాలు వెలిశాయి. వాటన్నింటినీ గత డీటీఓ జ్ఞానవేణి పోలీసుల సాయంతో తొలగించారు. ఆ సమయంలో స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పర్యాటక ప్రాజెక్టు వస్తుందని, అందుకని ఖాళీ చేయిస్తున్నామని ఆమె చెప్పారు. దుకాణాల ఏర్పాటువెనుక దాసు హస్తం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. సంస్థ పరువు పోయేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ హయాంలో దాసును ఈ జిల్లా నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడు ఆయనే కూటమి ప్రభుత్వానికి ముద్దుగా కనిపించడంతో తీసుకువచ్చి రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. విశాఖకు ఎంతోమంది విదేశీ పర్యాటకులు, రాయబారులు, ఇతర రాషా్ట్రల ప్రతినిధులు వస్తారు. వారితో డీటీఓ హోదాలో దాసు చర్చలు జరపగలరా?, ప్రాజెక్టులపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వగలరా?...అంటే ఆ శాఖలో ఎవరూ నోరు విప్పడం లేదు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అత్యంత కీలకమైన ప్రాంతంలో బాధ్యతలు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రజా ప్రతినిధులైతే నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు నియమించాలని తాము కోరితే...ఏరికోరి ఆరోపణలు ఉన్నవారిని నియమిస్తున్నారని, తెర వెనుక ఏమి జరుగుతున్నదో అర్థం కావడం లేదని వాపోతున్నారు.