టమాటా కిలో రూ.2
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:40 AM
టమాటా ధర మరింత పడిపోయింది. వారం క్రితం 30 కిలోల క్రేట్ రూ.150 పలకగా, గురువారం రూ.50-60 తగ్గిపోయింది. రైతులకు కిలోకు రూ.2 మాత్రమే దక్కింది. అయినాసరే కొనుగోలుదారులు లేకపోవడంతో సుమారు వంద క్రేట్ల టమాటాలను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
దారుణంగా పడిపోయిన ధర
ఏఎల్‌పురం మార్కెట్‌లో 30 కిలోల క్రేట్ రూ.50-60
అయినాసరే కొరవడిన కొనుగోలుదారులు
వంద క్రేట్లకుపైగా సరకును తిరిగి తీసుకెళ్లిపోయిన రైతులు
కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): టమాటా ధర మరింత పడిపోయింది. వారం క్రితం 30 కిలోల క్రేట్ రూ.150 పలకగా, గురువారం రూ.50-60 తగ్గిపోయింది. రైతులకు కిలోకు రూ.2 మాత్రమే దక్కింది. అయినాసరే కొనుగోలుదారులు లేకపోవడంతో సుమారు వంద క్రేట్ల టమాటాలను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామానికి సమీపంలో వున్న గొలుగొండ, కొయ్యూరు మండలాలోని పలు గ్రామాల రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తుంటారు. వీటిని ఏఎల్‌పురం మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కొద్ది రోజుల నుంచి టమాటాల దిగుబడి వస్తుండడంతో ధరలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. సుమారు నెల రోజుల క్రితం 30 కిలోల క్రేట్ టమాటాలు రూ.300-350 ధర పలికాయి. ఆ తరువాత నుంచి మార్కెట్‌కు టమాటాల రాక పెరగడంతో ధర తగ్గిపోతున్నది. గత వారం క్రేట్ టమాటాలు రూ.150 పలకగా, ఈ వారం రేటు మరింత తగ్గిపోయింది. క్రేట్ టమాటాల ధర రూ.50-60కి తగ్గిపోయింది. వివిధ గ్రామాల నుంచి రెండు వందలకుపైగా క్రేట్లలో టమాటాలు తీసుకురాగా, వీటిలో సగం మాత్రమే అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసినా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశతో టమాటాలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఊరగాయ పచ్చళ్లు తయారు చేసుకుని వాటిని అమ్ముకుంటామని చెబుతున్నారు. కొంతమంది రైతులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రిటైల్‌గా టమాటాలు అమ్ముకుంటున్నారు.