Share News

నేడు వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:12 AM

అనకాపల్లి పట్టణంలోని వేల్పులవీధి (మెయిన్‌ రోడ్డు) గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలదండలతో అలంకరించారు. సుదీర్ఘ చరిత్ర వున్న వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని ఏటా సంక్రాంతి తరువాత వచ్చే శనివారంనాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది ఉత్సవ కమిటీ చైర్మన్‌ వాకాడ బాబు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

నేడు వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం
మెయిన్‌రోడ్డులో గౌరీ పరమేశ్వరుల ఆలయం

భారీ ఎత్తున ఏర్పాట్లు

విద్యుద్దీపాలు, పూలమాలలతో ఆలయం అలంకరణ

పలుచోట్ల భారీ విద్యుత్‌ సెట్టింగులు

ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు

అనకాపల్లి టౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణంలోని వేల్పులవీధి (మెయిన్‌ రోడ్డు) గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలదండలతో అలంకరించారు. సుదీర్ఘ చరిత్ర వున్న వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని ఏటా సంక్రాంతి తరువాత వచ్చే శనివారంనాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది ఉత్సవ కమిటీ చైర్మన్‌ వాకాడ బాబు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

మెయిన్‌రోడ్డులో చిననాలుగురోడ్ల జంక్షన్‌ నుంచి శారదా నది వరకు, నెహ్రూచౌక్‌ నుంచి ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్‌, అటు విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వరకు భారీ ఎత్తున విద్యుత్‌ దీపాల అలంకరణ చేపట్టారు. ఎన్టీఆర్‌ జంక్షన్‌, సత్య థియేటర్‌, తదితర ప్రాంతాల్లో భారీ విద్యుత్‌ సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేశామని చైర్మన్‌ బాబు తెలిపారు. గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం శనివారం మధ్యాహ్నం ప్రారంభమై ఆదివారం రాత్రి వరకు సాగుతుంది. వేడుకల్లో భాగంగా నేల వేషాలు, ప్రధాన కూడళ్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు

వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల కారణంగా శనివారం ఆర్టీసీ బస్సులను మళ్లింపు మార్గాల్లో నడపనున్నట్టు ఇన్‌చార్జి డీఎం రవిచంద్ర చెప్పారు. నెహ్రూచౌక్‌, మెయిన్‌ రోడ్డు, సుంకరమెట్ట జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు వె ళ్లే బస్సులు పూడిమడక రోడ్డు, జాతీయ రహదారి మీదుగా నడుపుతామన్నారు. విజయనగరం, తగరపువలస వైపు వెళ్లే బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రింగురోడ్డు, రైల్వేస్టేషన్‌, ఉడ్‌పేట, నెహ్రూచౌక్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయని, మధ్యాహ్నం తరువాత సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి విశాఖ రోడ్డులోకి మళ్లి, జాతీయ రహదారి, పూడిమడక రోడ్డు మీదుగా కాంప్లెక్స్‌కు వస్తాయన్నారు.. చోడవరం, మాడుగుల, దేవరాపల్లి వైపు వెళ్లే బస్సులు మధ్యాహ్నం తరువాత నుంచి విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వరకే నడుస్తాయని, అక్కడి నుంచి తిరుగుముఖం పడతాయని చెప్పారు.

Updated Date - Jan 18 , 2025 | 12:12 AM