Share News

నేడు మహా కుంభాభిషేకం

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:14 AM

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నగరంలోని ఆర్‌కే బీచ్‌లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

నేడు మహా కుంభాభిషేకం

  • ప్రయాగరాజ్‌ నుంచి తీసుకువచ్చిన జలాలతో శివలింగాలకు అభిషేకం

  • మధ్యాహ్నం 3 గంటలకు శివపార్వతుల కల్యాణం

  • కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి వెల్లడి

మహారాణిపేట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నగరంలోని ఆర్‌కే బీచ్‌లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబ్బిరామిరెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా 40వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నుంచి తీసుకువచ్చిన జలాలు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో ఉదయం తొమ్మిది గంటలకు కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు స్వయంగా అభిషేకాలు చేయవచ్చన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శివపార్వతుల కల్యాణం, హోమం జరుగుతాయని పేర్కొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బ్రహ్మానందం, అవధాని మాడుగుల నాగఫణిశర్మ, తదితరులు విచ్చేస్తారని సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:14 AM