Share News

‘సూర్య ఘర్‌’కు అరకొర స్పందన

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:10 AM

జిల్లాలో ‘ప్రధానమంత్రి సూర్యఘర్‌’ పథకం కింద రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గృహస్థులు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపకపోవడం లేదు. దేశంలో కోటి ఇళ్లపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2025-26 వరకూ అమలులో ఉంటుంది.

‘సూర్య ఘర్‌’కు   అరకొర స్పందన

పెట్టుబడి పెట్టేందుకు

ముందుకురాని గృహస్థులు

ఏడాది కాలంలో పేర్లు నమోదుచేసుకున్నవారు 66,960 మంది...

ఏర్పాటైంది కేవలం 5,065 మాత్రమే

అధికారులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని ప్రయోజనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ‘ప్రధానమంత్రి సూర్యఘర్‌’ పథకం కింద రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గృహస్థులు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపకపోవడం లేదు. దేశంలో కోటి ఇళ్లపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2025-26 వరకూ అమలులో ఉంటుంది. దీనిపై అవగాహన కోసం ఈపీడీసీఎల్‌ అధికారులు సోలార్‌ ప్యానళ్ల వెండర్లతో కలిసి సదస్సులు నిర్వహించారు. వ్యక్తిగత గృహాలు కలిగిన వారిలో అవగాహన పెంచడానికి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నుంచి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ వరకు యత్నిస్తున్నారు. అపార్టుమెంట్లకు వెళ్లి కార్యవర్గ సభ్యులకు వివరంగా చెబుతున్నారు. సోలార్‌ పవర్‌ వల్ల విద్యుత్‌ బిల్లు భారీగా తగ్గిపోతుందని, మొదట పెట్టుబడి పెట్టినా దానికి తగిన ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు. నగరంలో గేటెడ్‌ కమ్యూనిటీలుగా గుర్తింపు పొందిన ఆక్సిజన్‌ టవర్స్‌, ఎంవీవీ సిటీ, స్కైలైన్‌ తదితర బహుళ అంతస్థుల సముదాయాలకు వెళ్లి రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంటు ప్రయోజనాలు వివరించారు. అయినా పెద్దగా స్పందన లేదు.

ఏడాది కాలంలో 66,960 మంది మాత్రమే ఆసక్తి చూపుతూ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 8,539 మంది దరఖాస్తు చేశారు. కేవలం 5,065 మంది మాత్రమే ప్లాంట్లు పెట్టుకున్నారు. వాటి సామర్థ్యం 17,573 కిలోవాట్లు. ఆసక్తి చూపించిన వారిలో పది శాతం మంది కూడా వీటిని ఏర్పాటు చేసుకోకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు.

ఇదీ పథకం

నెలకు 120 యూనిట్లు ఉపయోగించేవారికి ఒక కిలోవాట్‌ సోలార్‌ పవర్‌ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు. ఈ యూనిట్‌కు రూ.60 వేలు ఖర్చవుతుంది. అందులో రూ.30 వేలు రాయితీగా వస్తుంది. నెలకు 240 యూనిట్లు వినియోగించేవారు రెండు కిలోవాట్ల పవర్‌ ప్లాంటు పెట్టుకోవచ్చు. వీరికి రూ.1.2 లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ.60 వేలు రాయితీగా లభిస్తుంది. కాగా నెలకు 360 యూనిట్లు ఉపయోగిస్తే మూడు కిలోవాట్ల పవర్‌ ప్లాంటు పెట్టుకోవచ్చు. దీనికి రూ.1.8 లక్షలు పెట్టుబడి అవసరం. రాయితీ రూ.78 వేలు వస్తుంది.

నెలనెలా బిల్లు కట్టేస్తున్నాము కదా...ఇబ్బందులు లేవు. ఇప్పుడు సోలార్‌ పవర్‌ అని రూ.లక్షలు పెట్టుబడి దేనికి?, దీనివల్ల మిగిలేది ఏముంది?...ఒకవేళ సోలార్‌ ప్యానళ్లు ఏ తుఫాన్‌ గాలికో పాడైపోతే పరిస్థితి ఏమిటి?...అనే ఆలోచనలో కొంతమంది ముందుకురావడం లేదు. అధికారులు మాత్రం వచ్చే ఏడాది మార్చి వరకూ మాత్రమే ఈ పథకం అమలులో ఉంటుందని, ఆ లోగా ఉపయోగించుకుంటే 50 శాతం రాయితీ వస్తుందని చెబుతున్నారు. పేర్లు రిజిస్టర్‌ చేసుకున్నవారు దరఖాస్తు సమర్పిస్తే, ఆ తరువాత ప్రాసెస్‌ అంతా తాము చూసుకుంటామని హామీ ఇస్తున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 01:11 AM