Share News

టైటిల్‌ డీడ్‌ తాకట్టు!

ABN , Publish Date - Jan 23 , 2025 | 01:09 AM

విశాఖ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌ కోసం స్థలాన్ని లీజుకు ఇచ్చిన ‘ది విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌’ (సూపర్‌ బజార్‌) యాజమాన్యం సరిదిద్దుకోలేని తప్పులు చేసింది. ఆ స్థలంపై బ్యాంకు రుణం తీసుకోవడానికి లీజుదారులైన సుహానీ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థకు యాజమాన్య హక్కులు (టైటిల్‌ డీడ్‌) పత్రాలను ఇచ్చేసింది. ఎవరిని అడిగి కో-ఆపరేటివ్‌ అధికారులు ఈ పని చేశారు?, ఏ ప్రయోజనాల ఆశించి చేశారు?...అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆ పత్రాలను తనఖా పెట్టి ఆ సంస్థ యాజమాని కిశోర్‌ బియానీ రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తరువాత దివాలా తీయడంతో రుణంలో సుమారు రూ.129.62 కోట్లు బకాయిగా ఉండిపోయింది. ఆ మొత్తం రాబట్టుకోవడానికి ఆర్‌బీఎల్‌ బ్యాంకు అనేక ప్రయత్నాలు చేసింది.

టైటిల్‌ డీడ్‌ తాకట్టు!

ముంబై వ్యాపారికి లబ్ధి చేకూర్చేందుకు అడ్డగోలుగా వ్యవహరించిన

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ అధికారులు

ఆయన దివాలా తీయడంతో

సరఫాసీ చట్టం కింద బ్యాంకు నోటీసు

వేలం వేసుకొని డబ్బు రాబట్టుకునే హక్కు

తెలియకుండా హక్కులు ఎవరికీ

బదిలీ చేయవద్దని హుకుం

విశ్వాసం లేని అధికారికి

విచారణ బాధ్యతలపై అనుమానం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌ కోసం స్థలాన్ని లీజుకు ఇచ్చిన ‘ది విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌’ (సూపర్‌ బజార్‌) యాజమాన్యం సరిదిద్దుకోలేని తప్పులు చేసింది. ఆ స్థలంపై బ్యాంకు రుణం తీసుకోవడానికి లీజుదారులైన సుహానీ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థకు యాజమాన్య హక్కులు (టైటిల్‌ డీడ్‌) పత్రాలను ఇచ్చేసింది. ఎవరిని అడిగి కో-ఆపరేటివ్‌ అధికారులు ఈ పని చేశారు?, ఏ ప్రయోజనాల ఆశించి చేశారు?...అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆ పత్రాలను తనఖా పెట్టి ఆ సంస్థ యాజమాని కిశోర్‌ బియానీ రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తరువాత దివాలా తీయడంతో రుణంలో సుమారు రూ.129.62 కోట్లు బకాయిగా ఉండిపోయింది. ఆ మొత్తం రాబట్టుకోవడానికి ఆర్‌బీఎల్‌ బ్యాంకు అనేక ప్రయత్నాలు చేసింది.

కిశోర్‌ బియానీకి సెంట్రల్‌ గ్రూపు షాపింగ్‌ మాల్స్‌తో పాటు బిగ్‌ బజార్‌ చైన్‌ మార్కెట్లు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. కరోనా తరువాత అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల బిజినెస్‌ ఊపందుకోవడంతో ఆయన వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. వ్యాపార విస్తరణ కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురై దివాలా తీశారు. కొన్ని వ్యాపారాలను రిలయన్స్‌ గ్రూపు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తీసుకున్న రుణాన్ని బ్యాంకు నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేర్చింది. అయితే విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన భూమి హామీగా ఉండడంతో దానిని వేలం వేసి డబ్బులు రాబట్టుకోవడానికి డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. కిశోర్‌ బియానీతో పాటు సూపర్‌ బజార్‌ యాజమాన్యానికీ అవి అందాయి. ‘సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకనస్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిమెంట్‌ (సరఫాసీ)’ చట్టం-2002 కింద నోటీసులు ఇచ్చింది. తమకు తెలియకుండా ఆ షాపింగ్‌ మాల్‌ను వేరొకరికి లీజుకు ఇవ్వడం గానీ, భూమిని విక్రయించడం గానీ చేయకూడదని పేర్కొంది. ఇందులో నలుగురిని పార్టీలుగా చూపించింది. రుణ గ్రహీతగా ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రీసోర్సెస్‌ను, గ్యారెంటీర్‌గా కిశోర్‌ బియానీని, తనఖాదారుగా సుహానీ మాల్‌ మేనేజ్‌మెంట్‌ను, లీజు ఇచ్చిన సంస్థగా విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్‌ను చూపించింది. భవిష్యత్తులో ఈ షాపింగ్‌మాల్‌, భూమితో జరిగే ఆర్థిక లావాదేవీలన్నింటిలోను ఈ సంస్థలకు చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్లతో పాటు డైరెక్టర్లు అంతా బాధ్యులవుతారని స్పష్టం చేసింది.

ఇదిలావుండగా ఈ నోటీసుల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో 51 విచారణకు ఆదేశించింది. సహకార శాఖలోనే ఒకరిని విచారాణాధికారిగా నియమించింది. అయితే ఆరోపణలు ఉన్న అధికారికి ఈ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సరైన విచారణ జరగాలని ప్రభుత్వం కోరుకోవడం లేదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను ఓ లీజుదారునికి ఎలా ఇచ్చేశారు? అనేది జిల్లా అధికారులను సైతం విస్మయపరుస్తోంది.

సూపర్‌ బజార్‌ స్థలం తనఖాపై కలెక్టర్‌ ఆరా

నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశం

లీజుదారుడు, అందుకు సహకరించిన నాటి

సూపర్‌బజార్‌ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

సూపర్‌బజార్‌కు చెందిన స్థలాన్ని బ్యాంకులో కుదువబెట్టిన వ్యవహారంపై కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆరా తీశారు. అసలేమి జరిగిందో నివేదిక సమర్పించాల్సిందిగా సూపర్‌బజార్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ను, జిల్లా సహకార అధికారిని కోరారు. లీజుకు తీసుకున్న స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టడంతో ఇప్పుడు రూ.129 కోట్ల రుణ భారం సూపర్‌ బజార్‌ నెత్తిన పడింది. ఈ వ్యవహారంపై సహకార శాఖ విచారణ ప్రారంభించింది. ప్రభుత్వ పరిధిలో గల ఒక సంస్థ నుంచి లీజుకు తీసుకున్న స్థలాన్ని బ్యాంకులో కుదువబెట్టిన సుహాని సంస్థపైనా, అందుకు సంబంధించి 2018-19లో సంతకాలు చేసిన సూపర్‌బజార్‌ అధికారులపైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రస్తుత అధికారులను జిల్లా యంత్రాంగం ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంఽధించి కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు.

Updated Date - Jan 23 , 2025 | 01:09 AM