శివ పూజకు వేళాయె
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:45 PM
ప్రముఖ శైవక్షేత్రమైన హుకుంపేట మండలం మఠం పంచాయతీ పరిధి మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను మూడు రోజులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

శివరాత్రి వేడుకలకు మత్స్యగుండం ముస్తాబు
ఏర్పాట్లు చేసిన అధికారులు, ఉత్సవ కమిటీ
నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
(పాడేరు/హుకుంపేట- ఆంధ్రజ్యోతి)
ప్రముఖ శైవక్షేత్రమైన హుకుంపేట మండలం మఠం పంచాయతీ పరిధి మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను మూడు రోజులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పచ్చని కొండలు, సుందరమైన మత్స్యగెడ్డ వద్ద ఉన్న ఈ మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే సమస్యలు తొలగిపోయి, కోరిన కోర్కెలు తీరతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెనుకనున్న కోరికలింగాన్ని మూడు సార్లు ఎత్తితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, మత్స్యగుండాలు వద్ద నున్న మత్స్యాల(చేపలు)కు మరమరాలు, కొబ్బరి ముక్కలు వేసినప్పుడు అవి దర్శనమిస్తే సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో విశిష్టత ఉన్న మత్స్యగుండాన్ని గుర్తించి 1964 సంవత్సరంలో అప్పటి పాడేరు తహసీల్దార్ కుసర్లపాటి సత్యనారాయణ, సత్యవతి దంపతులు ఇక్కడికి వచ్చారు. వారికి పిల్లలు లేకపోవడంతో ఇక్కడ మొక్కుబడులు తీర్చుకోగా, వారికి ఏడాదిలోనే పిల్లలు పుట్టడంతో 1966- 67 సంవత్సరంలో గ్రామ పెద్దలుగా వ్యవహరిస్తున్న మఠం సన్యాసినాయుడు, చినరామునాయుడు, గ్రామస్థులతో చర్చించి ఆలయం నిర్మాణానికి మట్టిగోడలతో శ్రీకారం చుట్టారు. ఆలయం వద్ద మత్స్యలింగేశ్వరస్వామి, వినాయకుడు, నంది, అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో 2004లో ఏపీ టూరిజం, విశాఖ నగరాభివృద్ధి సంస్థల ఆధర్యంలో రూ.కోటి వెచ్చించి నూతన ఆలయ నిర్మాణం, మత్స్యకన్య, త్రిముఖ లింగేశ్వరస్వామి ప్రతిమలతో పాటు సుందరమైన పార్కును ఏర్పాటు చేశారు. తరువాత 2016- 17లో వుడా ఆధ్వర్యంలో రూ.30 లక్షలు వెచ్చించి మత్స్యగుండాన్ని దర్శించేందుకు వీలుగా గెడ్డపై వంతెన, నాగదేవత ఆలయం, వేదిక, పర్యాటకులు కూర్చొనేందుకు బెంచీలు, కమిటీ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ప్రహరీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
మత్స్యగుండానికి సంబంధించిన పురాణ గాథ
పూర్వం జి.మాడుగుల మండలం మత్స్యగెడ్డ వద్ద సింగరాజులు, మత్స్యరాజులు అనే రెండు రకాల దేవతలు(మత్స్యాలు) నివశించేవారు. నిత్యం జీవనదిగా ప్రవహించే మత్స్యగెడ్డపై ఈ రెండు వర్గాల మధ్య పోరు ఏర్పడగా, సుమారుగా మూడు నెలల పాటు మత్స్యరాజులు, సింగరాజులు మధ్య భారీ యుద్ధం జరిగింది. ఈ పోరులో మత్స్యరాజులు తన సంతానాన్ని మత్స్యలింగేశ్వరస్వామి కొలువై ఉన్న మత్స్యగుండం వద్ద స్వామివారికి అప్పగించి యుద్ధానికి వెళ్లి, ఆ యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించి వచ్చి మత్స్యగుండంలో స్థిరపడినట్టు గిరిజనులు చెబుతుంటారు. తరువాత మత్స్యగుండంలో ఉన్న మత్స్యాలు(చేపలు)లను కొందరు సాధువులు సాధారణ చేపలుగా భావించి వాటిని పట్టుకుని, కత్తులతో కోసి ప్రాణాలు తీయడంతో అవి పెద్ద పెద్ద బండరాళ్లుగా మారిపోయాయని, దీంతో అప్పటి నుంచి ఆ మత్స్యాలను ఎవ్వరూ చంపకుండా పూజిస్తారనేది గిరిజనుల విశ్వాసం. కొబ్బరి ముక్కలు, మరమరాలు, అరటిపండ్లు వేసి భక్తులు పిలిస్తే అవి బయటకొచ్చి తిని వెళ్లడం భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నది.
శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈ నెల 25, 26, 27 తేదీల్లో మహా శివరాత్రి ఉత్సవాలను మత్స్యగుండంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ప్రత్యేక పారిశుధ్య పనులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, ఇతర శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్నానాలు ఆచరించే గుండాల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు నిర్మించారు. బుధవారం రాత్రంతా భక్తులు జాగరణ చేసి గురువారం తెల్లవారుజామున మత్స్యగెడ్డలో పుణ్య స్నానాలు ఆచరించి మత్స్యలింగేశ్వరుడిని దర్శించుకుంటారు. మంగళ, బుధ, గురువారాలు మత్స్యగుండాన్ని దర్శించే భక్తుల రాకపోకలకు అనువుగా పాడేరు నుంచి మత్స్యగుండానికి 24 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.