ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:54 AM
మండలంలోని జి.కోడూరు పంచాయతీ నిధులు పక్కదారి పట్టడడంతో ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నిధులు దుర్వినియోగానికి సంబంధించి సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మిని(వైసీపీ మద్దతుదారు) మూడు నెలల పాటు పదవి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసింది.

జి.కోడూరు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
ఇప్పటికే సర్పంచ్‌పై వేటు
మాకవరపాలెం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జి.కోడూరు పంచాయతీ నిధులు పక్కదారి పట్టడడంతో ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నిధులు దుర్వినియోగానికి సంబంధించి సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మిని(వైసీపీ మద్దతుదారు) మూడు నెలల పాటు పదవి నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసింది.
జి.కోడూరు పంచాయతీలో 2021 నుంచి 2024 వరకు 14, 15ఆర్థిక సంఘాల నిధులు సుమారు సుమారు 64 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మళ్ల జగన్నాథం గత ఏడాది జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు నెలల్లో అధికారులు ఇక్కడ విచారణ జరిపారు. నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారణ కావడంతో ఆ ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. సర్పంచ్‌తోపాటు ఆయా సమయాల్లో కార్యదర్శులుగా పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు కూడా నిధులు దుర్వినియోగానికి కారకులని తేల్చారు. దీంతో సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మిని ఆ పదవి నుంచి మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధులు దుర్వినియోగం జరిగిన సమయంలో జి.కోడూరు పంచాయతీ కార్యదర్శులుగా శివప్రసాద్, అప్పలరెడ్డి, రాజారావులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శివప్రసాద్ ప్రస్తుతం కోటవురట్ల మండలంలో, అప్పలరెడ్డి మాడుగుల మండలంలో, రాజారావు మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. రాజారావు గిడుతూరు, లచ్చన్నపాలెం, జెడ్.గంగవరం పంచాయతీలకు ఇన్‌చార్జి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.