నర్సీపట్నంలో ముగ్గురి అదృశ్యం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:53 AM
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాపు వీధిలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి పట్టణ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన బట్ట రాణి, తల్లి చక్రమ్మ, పెద్ద కుమారుడు రాజేశ్, చిన్న కుమారుడు మోహన్‌తో కలిసి నర్సీపట్నం కాపువీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అంతా ఒకే కుటుంబ సభ్యులు
8వ తేదీ నుంచి కానరాని ఆచూకీ
పట్టణ పోలీసుల ముమ్మర దర్యాప్తు
నర్సీపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాపు వీధిలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి పట్టణ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మండలం నీలంపేటకు చెందిన బట్ట రాణి, తల్లి చక్రమ్మ, పెద్ద కుమారుడు రాజేశ్, చిన్న కుమారుడు మోహన్‌తో కలిసి నర్సీపట్నం కాపువీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు రాజేశ్ తోపుడు బండిపై ఫ్యాన్సీ సామగ్రి అమ్ముకునేవాడు. చిన్న కుమారుడు మోహన్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా రెండు నెలలుగా టీ దుకాణం నడుపుతున్నాడు. రాజేశ్ సుమారు రూ.10 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ విషయం కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అయితే ఫ్యాన్సీ సామగ్రి అమ్మకం లాభసాటిగా లేదని, టీ టైమ్ షాపులోనే తినుబండారాలు అమ్ముకుంటానని తమ్ముడు మోహన్‌తో అనడంతో ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకుందామని అనుకున్నారు. మోహన్ షాపులో పెట్టుబడి పేరుతో ఈ నెల 6వ తేదీన తెలిసిన వారి దగ్గర రాజేశ్ మరో రూ.50 వేలు అప్పు చేశాడు. ఈ విషయం తెలిసి...ఆ డబ్బులు ఏమయ్యాయని మోహన్ ఈ నెల ఏడో తేదీన అన్నను నిలదీశాడు. పాత అప్పులకు వడ్డీల కింద కట్టేశానని రాజేశ్ చెప్పాడు. అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మోహన్ నీలంపేటలోని సొంతింటికి వెళ్లిపోయాడు. ఉదయం సెల్ ఫోన్ చూసే సరికి ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు రాజేశ్ పెట్టిన మెసేజ్‌లు చూసి ఆందోళన చెందాడు. ఈ నెల 8న ఉదయం కాపువీధిలోని ఇంటికి వచ్చి చూస్తే తల్లి రాణి, అమ్మమ్మ పెనుమచ్చు చక్రమ్మ, అన్నయ్య రాజేశ్ కనిపించలేదు. బంధువులకు రెండు రోజులుగా ఫోన్లు చేసి వాకబు చేశాడు. ఆచూకీ లేకపోవడంతో ఈ నెల పదో తేదీన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేశ్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. నాతవరం మండలం ఎంబీ పట్నం ఏలేరు కాలువ వద్ద చివరిగా సిగ్నల్స్ కనిపించాయన్నారు. అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ముగ్గురి ఫొటోలు పెట్టినట్టు ఆయన చెప్పారు. ఏడు రోజులుగా తల్లి, అమ్మమ్మ, అన్నయ్య ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనగా ఉందని మోహన్ వాపోయాడు.