Share News

ఇళ్ల కాలనీల్లో దొంగలు!

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:17 AM

గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో (కూటమి ప్రభుత్వం వీటిని పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌లుగా పేరు మార్చింది) ఇళ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన సామగ్రికి రక్షణ కొరవడింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఇనుము, సిమెంట్‌కు లెక్కలు లేకుండా పోయాయి. గత సాధారణ ఎన్నికల ముందు ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేయడంతో.. అప్పటి నుంచి భవన నిర్మాణ సామగ్రి అపహరణకు గురవుతున్నది.

ఇళ్ల కాలనీల్లో దొంగలు!
ఇళ్ల కాలనీల్లో చోరీ చేసి, రొంగలివానిపాలెంలో నిల్వ చేసిన ఇనుము

పెద్ద మొత్తంలో ఇనుము, సిమెంట్‌, ఇసుక అపహరణ

కొంతమంది వైసీపీ నేతలు తరలించుకుపోయినట్టు స్థానికులు ఆరోపణ

జిల్లా కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్థులు

విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని వినతి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో (కూటమి ప్రభుత్వం వీటిని పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌లుగా పేరు మార్చింది) ఇళ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన సామగ్రికి రక్షణ కొరవడింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఇనుము, సిమెంట్‌కు లెక్కలు లేకుండా పోయాయి. గత సాధారణ ఎన్నికల ముందు ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేయడంతో.. అప్పటి నుంచి భవన నిర్మాణ సామగ్రి అపహరణకు గురవుతున్నది.

గత వైపీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో అనకాపల్లి మండలంలో సంపతిపురం నుంచి ఆర్‌.బయ్యవరం వరకు జగనన్న కాలనీల్లో సమారు 350 గృహాలను పేదలకు మంజూరు చేశారు. అన్ని ఇళ్ల నిర్మాణాలను అప్పట్లోనే ప్రారంభించారు. గత ఏడాది సాధారణ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేనాటికి పలు ఇళ్లు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. ఎన్నికల ముందు ఇళ్ల నిర్మాణ పనులు ఆపేశారు. అధికారులు ఎన్నికల హడావిడిలో వుండడంతో ఇదే అదనుగా భావించిన కొంతమంది వైసీపీ నాయకులు ఇళ్ల కాలనీల్లో ఇనుము, సిమెంట్‌, ఇసుకను మాయం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

కుంచంగి రెవెన్యూ పరిధి రొంగలివానిపాలెం పంచాయతీలోని వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఎన్నికల సమయంలో సుమారు 100 టన్నుల ఇనుము, ఎనిమిది వేల బస్తాల సిమెంట్‌, వందలాది టన్నుల ఇసుకను నిల్వ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో స్థానిక వైసీపీ నాయకుడు ఒకరు కూలీలను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో సుమారు 80 టన్నుల ఇనుము, పెద్ద ఎత్తున సిమెంట్‌ బస్తాలను అక్రమంగా తరలించుకుపోయి అమ్ముకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక నిల్వలు కూడా తరిగిపోయాయి. ఈ సమయంలో రొంగలివానిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది అనకాపల్లి పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో మొక్కుబడిగా కేసు నమోదు చేసి, ఎవరిపైనా చర్యలు చేపట్టలేదు. ఇదే అదనుగా భావించిన వైసీపీ నేతలు మిగిలిన ఇనుము, ఇసుక, సిమెంట్‌ను తరలించుకుపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వైసీపీ నాయకులు.. కాలనీల్లో మిగిలివున్న ఇనుమును రహస్యంగా తరలించేందుకు రెండు రోజుల కిందట ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు

పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భవన నిర్మాణ సామగ్రి మాయమవడంపై గ్రామానికి చెందిన కొందరు ఇటీవల మరోసారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను స్వయంగా కలిసి పేదల ఇళ్ల నిర్మాణ సామగ్రి అపహరణపై విచారణ జరిపించాలని కోరారు. అదే విధంగా అనకాపల్లి రూరల్‌ పోలసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. సంపతిపురం నుంచి రొంగలివానిపాలెం వరకు వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లలో 2024 జనవరి తరువాత ఇనుము, ఇసుక, సిమెంట్‌ దొంగలపాలయ్యాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు.

Updated Date - Jan 30 , 2025 | 01:17 AM