Share News

నాడు వారు.... ఇప్పుడు వీరు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:51 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ.. జిల్లాలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు యథావిధిగానే సాగిపోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులు గ్రావెల్‌ తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల ముందు వరకు వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వుకోగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీల నాయకులు అదే బాటలో నడుస్తున్నారు.

నాడు వారు.... ఇప్పుడు వీరు!
సబ్బవరం మండలం గంగవరంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్విన ప్రదేశం

అధికారంలో ఎవరున్నా.. ఆగని గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

గత ఐదేళ్లలో కొండలు, గుట్టలను తవ్వుకుపోయిన వైసీపీ నేతలు

ఇప్పుడు అదే దారిలో కూటమి నేతలు

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు, అమ్మకాలు

చోద్యం చూస్తున్న అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ.. జిల్లాలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు యథావిధిగానే సాగిపోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులు గ్రావెల్‌ తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల ముందు వరకు వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వుకోగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీల నాయకులు అదే బాటలో నడుస్తున్నారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మెటల్‌, సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకోసం గ్రావెల్‌ అవసరం ఏర్పడింది. మరోవైపు అనకాపల్లి చుట్టు పక్కల మండలాలు, జాతీయ రహదారి పక్కనున్న గ్రామాలు, చోడవరం, నర్సీపట్నం వంటి పట్టణ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను గ్రావెల్‌తో ఎత్తు చేస్తున్నారు. దీంతో గ్రావెల్‌కు గిరాకీ ఏర్పడింది. కొంతమంది అక్రమార్కులు (అధికార పార్టీతోపాటు గతంలో వైసీపీలో వుండి, ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తరువాత కూటమి పార్టీల్లో చేరినవారు) కొండవాలు ప్రాంతాలు, ప్రభుత్వం భూముల్లో రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో గ్రావెల్‌ తవ్వి, డంపర్‌ లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అనకాపల్లి, మునగపాక, ఎస్‌.రాయవరం, సబ్బవరం, పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల నుంచి రోజూ పెద్ద మొత్తంలో గ్రావెల్‌ను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు, ఇళ్ల నిర్మాణాల్లో పునాదుల మధ్యలో ఖాళీలను నింపడానికి తరలించి జేబులు నింపుకుంటున్నారు. టిప్పర్‌ లోడ్‌కు దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. గ్రావెల్‌ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన గనులు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

అనకాపల్లి మండలం కొండకొప్పాక, గొలగాం, మార్టూరు, తగరంపూడి, సీతానగరం, కూండ్రంగి, కుంచంగి, జంగాలపాలెం; కశింకోట మండలం అచ్చెర్ల పరిసరాలు; సబ్బవరం మండలంలో గంగవరం, నంగినారపాడు, పైడివాడ, పైడివాడ అగ్రహారం, గాలిభీమవరం గ్రామాల పరిధిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే గనుల శాఖ సిబ్బంది ఆ ప్రాంతాలకు వెళ్లి హడావిడి చేసి, చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నిచోట్ల తనిఖీలు జరిపారు, ఎంత మొత్తం ఫైన్‌ విధించారనే వివరాలను వీడియాకు వెల్లడించడం లేదు.

Updated Date - Feb 08 , 2025 | 12:51 AM