సీపీ ఆదేశాలు బే ఖాతరు!
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:44 AM
నగర పోలీస్ కమిషనరేట్‌లో వింత పరిస్థితి నెలకొంది.

గత నెల 23న 93 మంది పోలీస్ సిబ్బంది బదిలీ
జాబితాలో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు
రిలీవ్ అయ్యి...తమకు కేటాయించిన స్టేషన్‌లో చేరింది 10 మంది లోపే
మిగిలిన వారంతా పాత స్టేషన్లలోనే విధులు
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న 93 మంది సిబ్బందిని గత నెల 23న వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు. వారిలో 15 మంది ఏఎస్‌ఐలు, 43 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా ఒకటి, రెండు రోజుల్లోనే తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిపోర్టు చేయాలి. కానీ బదిలీ అయిన వారిలో 90 శాతం మంది పాత పోలీస్ స్టేషన్లలోనే కొనసాగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీపీ బదిలీ చేసిన 93 మందిలో పది మందిలోపు మాత్రమే తమకు కేటాయించిన స్టేషన్‌కు వెళ్లి రిపోర్టు చేశారు. మిగిలిన వారంతా ఎందుకు కదలడం లేదనే చర్చ జరుగుతోంది. పాత పోలీస్ స్టేషన్లలో వసూళ్లకు, మొక్కుబడి విధి నిర్వహణకు అలవాటుపడడం వల్లే బదిలీ చేసినప్పటికీ కొత్త స్టేషన్‌కు వెళ్లడానికి విముఖత వ్యక్తంచేస్తున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే పోలీస్ హౌస్ ఆఫీసర్లే తమ స్టేషన్ నుంచి బదిలీ అయిన వారిని రిలీవ్ చేయడం లేదని, వారి స్థానంలో కొత్తగా పోస్టింగ్ ఇచ్చినవారు చేరకపోతే స్టేషన్‌లో ఇబ్బంది ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. బదిలీ అయినా పాత స్టేషన్‌లోనే కొనసాగుతున్నవారి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తమను రిలీవ్ చేయాల్సిందిగా తమ ఎస్‌హెచ్‌ఓలను వేడుకుంటున్నామని, కానీ వారు మాత్రం ఎందుకో స్పందించడం లేదని, అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదిలావుండగా ద్వారకా పోలీస్ స్టేషన్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ గత ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారని, ఆయన్ను మాత్రం సీపీ బదిలీ చేయలేదని అంటున్నారు. సదరు హెడ్ కానిస్టేబుల్ వసూళ్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తుండడం వల్లే స్టేషన్ అధికారులు ఆయన్ను బదిలీ నుంచి తప్పించేలా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. దీనిపై సీపీ దృష్టిసారించాలని కోరుతున్నారు.
------------------------------------------------------------------------
ఉక్కులో వీఆర్‌ఎస్‌కు 370 దరఖాస్తులు
కేంద్రం సాయం ప్రకటన నేపథ్యంలో వెనక్కి తగ్గే అవకాశం?
విశాఖపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉక్కు కర్మాగారంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి (వీఆర్‌ఎస్) అనూహ్యమైన స్పందన కనిపిస్తోంది. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఈ రెండు రోజుల్లోనే మొత్తం 370 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు 196 మంది కాగా 174 మంది ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందినవారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగకపోవడంతో ఉద్యోగులకు సంస్థపై నమ్మకం తగ్గిపోయింది. ఇక్కడ వీఆర్‌ఎస్ తీసుకొని, వేరే సంస్థకు వెళ్లి పని చేసుకోవచ్చుననే ఉద్దేశంలో కొందరు ఉన్నారు. అయితే ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం ప్రకటించింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.17 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ సాయం ఎలా ఉంటుందనే దానిపై శుక్రవారం పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ తరువాత కూడా వీఆర్‌ఎస్‌కు ఉద్యోగులు మొగ్గు చూపుతారా? లేదంటే సంస్థపై విశ్వాసంతో ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారా? అనేది నెలాఖరుకు తేలుతుంది. తొలి విడతలో వీఆర్‌ఎస్ ద్వారా వేయి మందిని ఇంటికి పంపాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం సాయం చేస్తున్న నేపథ్యంలో ఎంతమంది ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.
------------------------------------------------------------------------
ఆరోగ్య శాఖలో ఇ-పాలన
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల చర్యలు
ప్రక్రియ ప్రారంభించాలని సూచించిన డీఎంహెచ్‌వో
కేజీహెచ్, విమ్స్ సహా బోధనాస్పత్రుల్లోనూ అమలు
విశాఖపట్నం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్ రహిత పాలన దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇ-పాలన అమలుకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు కీలక సూచనలిచ్చారు. రానున్న పది రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.
కేజీహెచ్, విమ్స్ సహా బోధనాస్పత్రుల్లో ఇ- పాలన అమలుకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే డీఎంహెచ్‌వో ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని బోధనాస్పత్రుల్లో ఇ-పాలన అమలు దిశగా కేజీహెచ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనేక విభాగాల్లో కొద్ది నెలలుగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ఇ-పాలన అమలు అవసరమని భావిస్తున్నారు. ప్రతి ఫైల్‌కు ఒక నంబరు ఇచ్చి, ఈ-ఆఫీస్‌లోనే ప్రతి ఫైల్ నడపాలని అన్ని సెక్షన్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు సూచించారు. 48 గంటలకు మించి ఫైలు ఆయా సెక్షన్లలో పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమ్స్, ఘోషా, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఈఎన్‌టీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రి సూపరింటెండెంట్లు కూడా సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
వేగవంతానికి అవకాశం
ఇ-పాలనతో ఫైళ్లు వేగంగా కదిలే అవకాశం ఉంటుంది. రోజుల తరబడి పెండింగ్‌లో పెట్టడానికి అవకాశం ఉండదు. పెండింగ్‌లో పెట్టాలంటే స్పష్టమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రజలు, సిబ్బందికి మేలు జరుగుతుంది. అయితే గతంలో కూడా ప్రభుత్వాలు ఇ-పాలన అమలుకు ఆదేశాలిచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని శాఖల్లో అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇందులో ఆరోగ్య శాఖ ముందుందని సమాచారం.