పది గంటలైనా మంచు వీడదాయె
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:45 PM
మన్యంపై పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. దీంతో గురువారం ఉదయం పదిన్నర గంటల వరకు ఎండ ఊసేలేని పరిస్థితి ఏర్పడింది.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
అరకులోయ, జి.మాడుగులలో 9.6 డిగ్రీలు
వణుకుతున్న మన్యం వాసులు
పాడేరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మన్యంపై పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. దీంతో గురువారం ఉదయం పదిన్నర గంటల వరకు ఎండ ఊసేలేని పరిస్థితి ఏర్పడింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతుండడంతో గురువారం అరకులోయ, జి.మాడుగులలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్నాళ్లుగా ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రతకు జనం వణుకుతున్నారు. ఉదయం పది గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో పది గంటలు దాటే వరకు జనం సాధారణ జీవనం సాగించలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో చలి మంటలు వేసుకుంటూ ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
దిగజారుతున్న ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో అరకులోయ, జి.మాడుగులలో గురువారం 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, హుకుంపేటలో 10.1, చింతపల్లిలో 10.3, పాడేరులో 10.5, డుంబ్రిగుడలో 10.6, ముంచంగిపుట్టులో 11.4, పెదబయలులో 11.8, జీకేవీధిలో 12.6, అనంతగిరిలో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో జనం గజగజ వణికిపోతున్నారు. వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం చూపడంతో ఎక్కడ చూసినా చలి మంటలే కనిపించాయి.