తేలని బార్క్ నిర్వాసితుల సమస్య
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:52 PM
బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) నిర్వాసితుల సమస్య ఎన్నేళ్లయినా పరిష్కారానికి నోచుకోవడంలేదు. తొలుత భూములను సర్వే చేయడానికి సహకరించాలని, ఆ తర్వాత పరిహారం నిర్ణయిస్తామని అధికారులు చెబుతుండగా, ముందు ధర నిర్ణయించాలని, ఆ తరువాతే సర్వేకు అంగీకరిస్తామని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు.

సర్వే చేసి సాగుదారులను గుర్తిస్తామంటున్న అధికారులు
నష్టపరిహారం నిర్ణయించిన తర్వాతే సర్వే చేయాలని నిర్వాసితులు పట్టు
అచ్యుతాపురం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) నిర్వాసితుల సమస్య ఎన్నేళ్లయినా పరిష్కారానికి నోచుకోవడంలేదు. తొలుత భూములను సర్వే చేయడానికి సహకరించాలని, ఆ తర్వాత పరిహారం నిర్ణయిస్తామని అధికారులు చెబుతుండగా, ముందు ధర నిర్ణయించాలని, ఆ తరువాతే సర్వేకు అంగీకరిస్తామని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఆర్డీవో ఆయీషా సోమవారం దొప్పెర్లలో బార్క్ నిర్వాసితులను కలిశారు. ఇప్పటికిప్పుడు భూములను స్వాధీనం చేసుకోవడం లేదని, సాగులో ఎవరున్నారు? ఎవరికి పరిహారం ఇవ్వాలి? అనే దానిపై సర్వే చేస్తామని ఆమె చెప్పారు. ఇందుకు అచ్యుతాపురం డీటీ ఒక ఫార్మేట్‌ను సిద్ధం చేసి, అధికారులతో సర్వే జరిపి సాగుదారుల ఫొటోలతో ధ్రువీకరణ పత్రాలను ఇస్తామని, ఆ తర్వాత ధర నిర్ణయిస్తామని ఆర్డీఓ తెలిపారు. అయితే నిర్వాసిత రైతులు ఇందుకు ససేమిరా అన్నారు. నష్టపరిహారం ఎంతిస్తారో చెప్పండి, ఆ తరువాత సర్వే చేసుకోండి అని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు.
15 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య
బార్క్ ఉద్యోగుల నివాస కాలనీ నిర్మాణం కోసం దొప్పెర్ల పంచాయతీలోని వివిధ సర్వే నంబర్లలో 91.22 ఎకరాలను సేకరించాలని 2010 ఆగస్టులో ఏపీఐఐసీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికే కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు. అయినప్పటికీ ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారన్నది అధికారులు వెల్లడించలేదు. సేకరించాల్సిన భూముల్లో జిరాయితీతోపాటు డి.పట్టా భూములు, ఎటువంటి పట్టాలు లేకుండా రైతులు సాగు చేసుకుంటున్న భూములు వున్నాయి. పట్టాలు లేకపోయినా.. పేద రైతుల సాగులో వున్న భూములకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు. జిరాయితీ, పట్టా భూములకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న వారికి ఎటువంటి పరిహారం లభించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో దాదాపు 15 సంవత్సరాల నుంచి బార్క్ ఉద్యోగుల నివాస కాలనీకి భూ సేకరణ కొలిక్కి రావడంలేదు.