Share News

ఆశాజనకంగా పిప్పళ్ల ధర!

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:01 PM

పిప్పళ్లు ధరలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ధరలు స్థిరంగా ఉండడంతో ప్రస్తుతం వారపు సంతల్లో పిప్పళ్లు క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఆశాజనకంగా పిప్పళ్ల ధర!
హుకుంపేట సంతలో శనివారం వర్తకులు కొనుగోలు చేసిన పిప్పళ్లు(బస్తాలు)

మొదటి రకం కిలో రూ.350 కొనుగోలు

రెండేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్న ధరలు

సంతల్లో ముమ్మరంగా క్రయవిక్రయాలు

నిలకడగా ధర ఉండడంతో గిరి రైతుల ఆనందం

(పాడేరు/ఆంధ్రజ్యోతి)

పిప్పళ్లు ధరలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ధరలు స్థిరంగా ఉండడంతో ప్రస్తుతం వారపు సంతల్లో పిప్పళ్లు క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం హుకుంపేటలో, సోమవారం పెదబయలులో, మంగళవారం జి.మాడుగుల, గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతల్లో పిప్పళ్లు కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఔషధ గుణాలున్న పిప్పళ్లను ఏజెన్సీ వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబరు ఆఖరి వారం నుంచి పిప్పళ్లు క్రయవిక్రయాలు మొదలై ఏప్రిల్‌ నెలాఖరుకు వరకు కొనసాగుతాయి. ఏజెన్సీలో హుకుంపేట, జి.మాడుగుల, గుత్తులపుట్టు, పెదబయలు, ముంచంగిపుట్టు వారపు సంతల్లోనే ఎక్కువగా పిప్పళ్లు క్రయవిక్రయాలు జరుగుతాయి. వడ్డాది మాడుగులకు చెందిన వర్తకులు గిరిజన రైతులు, వర్తకుల నుంచి వాటిని కొనుగోలు చేస్తారు. పలు రకాల మందుల తయారీకి వినియోగిస్తుండడంతో వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లతో మంచి డిమాండ్‌ ఉంది.

వడ్డాది మాడుగుల నుంచి జాతీయ మార్కెట్‌కు..

అనకాపల్లి జిల్లా పరిధిలోని వడ్డాది మాడుగుల నుంచి పిప్పళ్లు జాతీయ మార్కెట్‌కు తరలిస్తారు. గిరిజనుల వద్ద కొనుగోలు చేసిన పిప్పళ్లును బాగా శుద్ధి చేసి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఎటువంటి తేమ లేకుండా ఎండబెట్టి, ప్యాక్‌ చేసి ముంబై, పశ్చిమబంగా, చెన్నై ప్రాంతాల్లోని జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, ఇతర దేశాలకు అవి ఎగుమతి అవుతాయని వర్తకులు తెలిపారు.

ఆశాజనకంగా కొనుగోలు ధరలు

గతంతో పోల్చితే ప్రస్తుతం పిప్పళ్లు ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని గిరిజన రైతులు అంటున్నారు. 2021 వరకు పిప్పళ్లు కొనుగోలు ధరలు పతనం కాగా, 2022 నుంచి ధరలు కాస్తా బాగున్నాయని, అలాగే 2023 సంవత్సరం నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వర్తకులు, రైతులు అంటున్నారు. ఔషధ గుణాలున్న పిప్పళ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఎక్కువ లావుగా ఉన్నది మొదటి (ముడి)రకం, తీగలా ఉండేది రెండో (నలక) రకంగా విభజిస్తారు. ప్రస్తుతం మొదటి రకం కిలో రూ.350, రెండో రకం కిలో రూ.50 చొప్పున వారపు సంతల్లో వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు, వర్తకులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగానే స్థానిక సంతల్లోని వీటి ధరలను నిర్ణయిస్తామని వర్తకులు తెలిపారు.

Updated Date - Jan 18 , 2025 | 11:01 PM