పర్యాటకుల సందడే సందడి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:07 PM
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శనివారం సందర్శకుల సందడి చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో శనివారం ఏజెన్సీలో అటు చింతపల్లి మండలం లంబసింగి మొదలుకుని ఇటు అనంతగిరి మండలం బొర్రా గుహలు వరకు సందర్శకుల రద్దీ కొనసాగింది.

సెలవులకు పోటెత్తిన సందర్శకులు
పర్యాటక ప్రాంతాలకు తాకిడి
పాడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శనివారం సందర్శకుల సందడి చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో శనివారం ఏజెన్సీలో అటు చింతపల్లి మండలం లంబసింగి మొదలుకుని ఇటు అనంతగిరి మండలం బొర్రా గుహలు వరకు సందర్శకుల రద్దీ కొనసాగింది. శీతాకాలంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు కుటుంబాలతో తరలి వస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది కనుమ మరుసటి రోజునే విద్యాలయాల పునఃప్రారంభమయ్యేవి.. కాని ఈ ఏడాది అందుకు భిన్నంగా కనుమ ముగిసిన ఐదు రోజుల తర్వాత విద్యాలయాల పునఃప్రారంభం కావడంతో సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు టూర్ చేస్తున్నారు. దీంతో శనివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
లంబసింగికి పర్యాటకుల తాకిడి
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు శనివారం భారీ సంఖ్యలో లంబసింగికి తరలివచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం వ్యూపాయింట్, లంబసింగి జంక్షన్, భీమనాపల్లి, తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద జాతర వాతావరణం నెలకొంది. పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాల సరసన ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి.
కిటకిటలాడిన వంజంగి, కొత్తపల్లి
పాడేరురూరల్: జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన వంజంగి మేఘాల పర్వతం, కొత్తపల్లి జలపాతం శనివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. మన్యంలో మంచు తీవ్రత అఽధికంగా ఉండడంతో వంజంగి పర్యాటకులను కనువిందు చేస్తోంది. వంజంగిలో ఉదయం 9 గంటల వరకు పాల సముద్రాన్ని తలపించే విధంగా మంచు మేఘాలు ఉంటున్నాయి. అలాగే మంచు చీల్చుకొని భానుడి కిరణాలు వస్తున్న సూర్యోదయం ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది.
జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు జలకాలు ఆడుతూ సందడి చేశారు. వంజంగి సందర్శన అనంతరం వందలాది మంది పర్యాటకులు కొత్తపల్లికి కుటుంబ సభ్యులతో చేరుకొని జలపాతంలో ఆనందంగా గడుపుతున్నారు. పర్యాట కేంద్రాలకు పర్యాటకుల తాకిడి అధికం కావడంతో పాడేరులోని లాడ్జీలు, వంజంగిలోని రిసార్ట్స్, భోజన, టిఫిన్ హోటళ్లు రద్దీగా మారాయి.