Share News

కొండను చెరబట్టిన భూ రాబందు

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:23 AM

గాజువాక నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత కుమారుడి అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి.

కొండను చెరబట్టిన భూ రాబందు

  • సొంత జాగీరుగా మార్చుకున్న వైసీపీ ముఖ్యనేత కుమారుడు

  • గజాల లెక్కన అమ్మకం

  • తమ స్థలం లాక్కొన్నాడని కొందరు, తాము ఇళ్లు కట్టుకునేందుకు

  • డబ్బులు గుంజేరని మరికొందరు ఆరోపణ

  • వెలుగుచూస్తున్న దయాల్‌నగర్‌ దాదా లీలలు

  • అతని కనుసన్నల్లోనే రెవెన్యూ అధికారులు

  • ఇప్పటికీ స్పందించని ఉన్నతాధికారులు

  • మొక్కుబడిగా వీఆర్‌ఓను పంపి చేతులు దులిపేసుకున్న వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గాజువాక నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత కుమారుడి అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ‘దయాల్‌నగర్‌లో గూండారాజ్‌’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన నేపథ్యంలో అతని బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కొండ తన సొంత జాగీరు అన్నట్టు పలువురికి విక్రయించడంతోపాటు ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు తమ వద్ద లక్షల రూపాయలు గుంజేవారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికీ అతని ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పెదగంట్యాడ మండలం దయాల్‌నగర్‌ కొండపై వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీని ఆనుకుని సుమారు రెండు వేల గజాల స్థలం చాలా ఏళ్లుగా ఒకరి ఆధీనంలో ఉంది. ఆ స్థలం ప్రధాన రోడ్డును ఆనుకుని ఉండడంతో వైసీపీ నేత కుమారుడి కన్ను పడింది. రోడ్డు పక్కన సుమారు 500 గజాలు స్థలాన్ని తనకు ఇవ్వాలని, అందులో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టుకుంటానని బెదిరించి మరీ తీసుకున్నాన్నా. పైగా మిగిలిన స్థలాన్ని ఎవరికి అమ్ముకున్నాసరే అందులో నిర్మాణ పనులు కాంట్రాక్టు తన అనుచరుడైన మేస్ర్తికి ఇవ్వాల్సిందేనని షరతు విధించారు. తప్పనిసరి పరిస్థితిలో అతను చెప్పినట్టే చేయాల్సి వచ్చిందని సంబంధిత స్థల యజమాని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే స్వర్ణ నూకాంబిక ఆలయం వద్ద 120 గజాల స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని చెప్పి...రూ.16.5 లక్షలకు వేరొకరికి విక్రయించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే ఆలయ సమీపంలో ఒకరు తాము ఉంటున్న ఇంటిపై అదనపు అంతస్థు నిర్మిస్తుంటే జీవీఎంసీ, రెవెన్యూ అధికారులను పంపించి కూలగొట్టించి, తర్వాత భవన యజమానిని తన వద్దకు రప్పించుకుని రూ.ఐదు లక్షలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా...చెప్పుకుంటూ పోతే వందల ఉదంతాలు ఉన్నాయని దయాల్‌నగర్‌ నివాసితులు పేర్కొంటున్నారు.

రెవెన్యూ అధికారుల తీరుపై ఆరోపణలు

ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దయాల్‌నగర్‌ కొండపై జాగాను వందేసి గజాలుగా విభజించి వైసీపీ ముఖ్య నేత కుమారుడు తన సొంత ఆస్తిలా విక్రయిస్తుంటే అడ్డుకుని క్రిమినల్‌ కేసులు పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా అతని దందాకు అడ్డుకట్ట వేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా అతను చెప్పినట్టు రెవెన్యూ, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నడుచుకుంటుండడం చూస్తే మామూళ్లు అందుతున్నాయనే భావన కలుగుతోందని స్థానికులు అంటున్నారు. దయాల్‌నగర్‌లో భూకబ్జాలు, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన తర్వాత కూడా రెవెన్యూ శాఖ అధికారులు కదలలేదు. ఆ ప్రాంత వీఆర్‌ఓ మాత్రం గురువారం ఉదయం కొండపైకి వెళ్లి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంలోని ఫొటోలు గల ఇళ్లు చూసి తిరిగి వెళ్లిపోయారు.

Updated Date - Mar 07 , 2025 | 01:23 AM