గిరిజన చట్టాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:35 AM
గిరిజన చట్టం 1/70ను రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అఖిలపక్షం, ఆదివాసీ జేఏసీ నేతలతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

- కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ స్పష్టీకరణ
- అఖిలపక్షం, జేఏసీ నేతలతో కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం
పాడేరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గిరిజన చట్టం 1/70ను రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అఖిలపక్షం, ఆదివాసీ జేఏసీ నేతలతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కులకు భంగం కలగకుండా ఆయా చట్టాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. గిరిజన సంఘాల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, దానిపై ముఖ్యమంత్రి సైతం స్పష్టమైన ప్రకటన చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్లడించారని ఆయన తెలిపారు.
ఎల్‌టీఆర్ కేసులు నాలుగు నెలల్లో పరిష్కరిస్తాం
జిల్లాలో ఉన్న 600 ఎల్‌టీఆర్(ట్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్) కేసులను నాలుగు నెలలో పరిష్కరిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు ఐటీడీఏలో ట్రైబల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని, రెవెన్యూలో అపరిష్కృతంగా ఉన్న కేసులపై సమీక్షిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి జరగలేదని మాత్రమే స్పీకర్ వ్యాఖ్యానించారని, చట్టం రద్దు చేయాలని అనలేదని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజనుల ఆదాయం పెంచడానికి, ఉపాధి అవకాశాలకు చర్యలు చేపడతామన్నారు. గిరిజన ప్రాంతంలో సర్వ హక్కులు గిరిజనులకే చెందుతాయన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించామని, ఆ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో అఖిలపక్షం, ఆదివాసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.