Share News

‘స్వచ్ఛాంధ్ర మిషన్‌’లో జిల్లా అథమం!

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:47 PM

స్వచ్ఛాంధ్ర మిషన్‌ కార్యకలాపాల్లో జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో స్వచ్ఛాంధ్ర మిషన్‌కు సంబంధించి 14 ఇండికేటర్స్‌ ఆధారంగా ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. అల్లూరి జిల్లా ఆఖరు స్థానానికి పరిమితమైంది.

‘స్వచ్ఛాంధ్ర మిషన్‌’లో జిల్లా అథమం!
పాడేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ముందు చెత్తాచెదారం

14 ఇండికేటర్స్‌ ఆధారంగా జిల్లాలకు ర్యాంకింగ్‌లు

స్థానిక ప్రతికూల పరిస్థితులు,

యంత్రాంగం అశ్రద్ధే కారణం

పంచాయతీలకు నిధులు అంతంతమాత్రమే

జిల్లా కేంద్రంలోనే పరిశుభ్రంగా ఉంచలేని దుస్థితి

భవిష్యత్తులో మెరుగుకు ప్రత్యేక చర్యలు అనివార్యం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

స్వచ్ఛాంధ్ర మిషన్‌ కార్యకలాపాల్లో జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో స్వచ్ఛాంధ్ర మిషన్‌కు సంబంధించి 14 ఇండికేటర్స్‌ ఆధారంగా ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. అల్లూరి జిల్లా ఆఖరు స్థానానికి పరిమితమైంది. అయితే జిల్లాలోని ప్రతికూల పరిస్థితులు, యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

జిల్లాలోని 22 మండలాలు పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లుగా విభజించి ఉన్నాయి. మండల కేంద్రాల్లో మినహా గ్రామాల్లో స్వచ్ఛాంధ్ర మిషన్‌ పనులు చేపట్ట లేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు ఇంటి పనులు, ఇతర ఆదాయ వనరులు లేకపోవడం, జనాభా తక్కువగా ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సాధారణ, ఆర్థిక సంఘ నిధులు అంతంత మాత్రమేగా ఉన్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో స్వచ్ఛత కార్యక్రమాలు జరగడం లేదు. చివరకు జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నది. స్థానికంగా పారిశుధ్య కార్మికుల కొరత, ఉన్న వారికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, వాహనాల కొరత వంటి కారణాలతో జిల్లా కేంద్రంలోనే ఆశించిన స్థాయిలో పారిశుధ్య పనులు నిర్వహించలేకపోతున్నారు. ఇక మండల కేంద్రాలు, గ్రామపంచాయతీల్లో పరిస్థితులను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పంచాయతీలను పట్టించుకోకపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో ఏజెన్సీలో ఆశించిన స్థాయిలో స్వచ్ఛత పనులు జరగడం లేదని స్పష్టమవుతున్నది. అలాగే పంచాయతీల ఆధీనంలో ఉన్న డంపింగ్‌యార్డులు, చెత్త సంపద కేంద్రాలు సైతం వినియోగానికి దూరంగా ఉన్నాయి. అలాగే చెత్త సేకరించేందుకు అందించిన రిక్షాలదీ అదే పరిస్థితి. ఈ తరుణంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరచి, స్వచ్ఛత కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడితే భవిష్యత్‌లోనైనా ఆశించిన ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:43 PM