Share News

కబళించిన కెరటం

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:53 AM

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడపాలెం సముద్ర తీరంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.

కబళించిన కెరటం

  • రాంబిల్లి మండలం వాడపాలెం సముద్ర తీరంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి, మరొక విద్యార్థి గల్లంతు

  • ఇరువురూ అన్నదమ్ముల బిడ్డలే...

  • నగరంలో నివాసం

రాంబిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడపాలెం సముద్ర తీరంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. స్నానానికి దిగిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి రాంబిల్లి పోలీసులు, మెరైన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కొత్తపేటకు చెందిన అన్నదమ్ములైన మొక్క శ్రీధర్‌, మల్లికార్జునరావులు విశాఖలో స్థిరపడ్డారు. ఎల్‌అండ్‌టిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌ కంచరపాలెం ప్రాంతంలోని ఇంద్రానగర్‌లో, సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న మల్లికార్జునరావు దువ్వాడ సంధ్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీధర్‌ ఒక్కగానొక్క కుమారుడు సూర్యతేజ (17) తగరపువలస అనిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో, ఆదినారాయణ ఒక్కగానొక్క కుమారుడు పవన్‌తేజ (17) దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీధర్‌, మల్లికార్జునరావులు పూజల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం స్వగ్రామమైన కొత్తపేట వచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకొని మఽద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వాడపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. సూర్యతేజ, పవన్‌తేజ సహా నలుగురు తీరానికి సమీపంలో స్నానాలు చేస్తుండగా బలమైన కెరటం ఒకటి లోపలకు లాగేసింది. తీరం వద్ద బీట్‌లో ఉన్న మెరైన్‌ పోలీసులు చూసి ముగ్గురిని రక్షించారు. మరొకరి ఆచూకీ దొరకలేదు. మెరైన్‌ పోలీసులు రక్షించిన ముగ్గురిలో కొనఊపిరితో ఉన్న సూర్యతేజ (17) ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు. గల్లంతైన పవన్‌తేజ (17) ఆచూకీ కోసం పోలీసులు, మెరైన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌, రాంబిల్లి సీఐ నరసింగరావు, మెరైన్‌ సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ నాగేంద్రలు సిబ్బందితో కలిసి వాడపాలెం సముద్రతీరం వద్దకు చేరుకున్నారు. సూర్యతేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్‌టిఆర్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ నరసింగరావు తెలిపారు. కాగా సూర్యతేజ మృతదేహం వద్ద అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు పలువురిని కలచివేసింది. పై సంఘటనతో కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Feb 10 , 2025 | 12:53 AM