పొంచి ఉన్న ప్రమాదం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:08 AM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన డముకు వ్యూ పాయింట్ వద్ద గల స్టీల్ రెయిలింగ్ దెబ్బతినడంతో ప్రమాదకరంగా ఉంది. అరకు అందాలను తిలకించేందుకు రోడ్డు మార్గం గుండా వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డముకు వ్యూపాయింట్ వద్ద ఆగి, ఘాట్ రోడ్డు అందాలను వీక్షిస్తారు.

దెబ్బతిన్న డముకు వ్యూపాయింట్ స్టీల్ రెయిలింగ్
ప్రకృతి అందాలను వీక్షించే పర్యాటకులు ఆదమరిస్తే లోయలోకి..
పట్టించుకోని అధికారులు
అనంతగిరి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన డముకు వ్యూ పాయింట్ వద్ద గల స్టీల్ రెయిలింగ్ దెబ్బతినడంతో ప్రమాదకరంగా ఉంది. అరకు అందాలను తిలకించేందుకు రోడ్డు మార్గం గుండా వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డముకు వ్యూపాయింట్ వద్ద ఆగి, ఘాట్ రోడ్డు అందాలను వీక్షిస్తారు. వ్యూపాయింట్ నుంచి చూస్తే మలుపులు తిరిగిన రోడ్డు మార్గం, గుహల లోపల ఏర్పాటైన రైల్వే ట్రాక్, తాటిపూడి డ్యాం, ఎత్తైన కొండల ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అయితే వ్యూపాయింట్ వద్ద స్టీల్ రెయిలింగ్ పూర్తిగా ఊడిపోవడంతో ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను వీక్షించే పర్యాటకులు ఆదమరిస్తే లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంది. రెయిలింగ్‌ను ఆనుకుని పర్యాటకులు ఫొటోలు దిగుతున్న క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన అందరిలో ఉంది. పర్యాటకులు అధికంగా వచ్చే ఈ వ్యూపాయింట్ వద్ద స్టీల్ రెయిలింగ్‌కు మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.