Share News

క్రూయిజ్‌ షిప్‌ వచ్చేస్తుంది

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:10 AM

విశాఖపట్నం పోర్టు క్రూయిజ్‌ టెర్మినల్‌ మళ్లీ కూత పెడుతోంది.

క్రూయిజ్‌ షిప్‌ వచ్చేస్తుంది

  • పోర్టు ప్రకటన

  • ఆగస్టు 4-22 తేదీల మధ్య నడపనున్నట్టు వెల్లడి

  • పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు రాక

  • ఈసారైనా కార్యరూపం దాల్చేనా?

  • గతంలో పలుమార్లు ప్రకటనలకే పరిమితం

  • ఏడాదిన్నర కిందట సిద్ధమైన టెర్మినల్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం పోర్టు క్రూయిజ్‌ టెర్మినల్‌ మళ్లీ కూత పెడుతోంది. క్రూయిజ్‌ షిప్‌లు వస్తాయని ప్రచారం చేస్తోంది. ఆగస్టు 4-22 తేదీల మధ్య మూడుసార్లు క్రూయిజ్‌ షిప్‌ను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పోర్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఈ నౌక (పేరు ప్రకటించకపోవడం గమనార్హం) పుదుచ్చేరి-చెన్నై-విశాఖపట్నం మధ్య నడుస్తుందని తెలిపింది.

క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించిన తరువాత ఇలాంటి ప్రకటనలు చేయడం పోర్టుకు పరిపాటిగా మారింది. గతంలో సింగపూర్‌ క్రూయిజ్‌ షిప్‌ వస్తుందని, ముంబై మేరీటైమ్‌ సదస్సులో ఒప్పందం చేసుకున్నామని అధికారులు ప్రకటించారు. కానీ అది అడ్రస్‌ లేదు. వాస్తవానికి టెర్మినల్‌ నిర్మించక ముందే (2022లో) విశాఖలోని పర్యాటక సంస్థలు కార్డిలియో క్రూయిజ్‌ షిప్పింగ్‌ యాజమాన్యంతో మాట్లాడి పుదుచ్చేరి-చైన్నై-విశాఖపట్నం మధ్య ఎంప్రెస్‌ నౌకను నడిపించారు. ఇప్పుడూ అదేమార్గంలో నడుపుతామని పోర్టు యాజమాన్యం చెబుతున్నా ఏ షిప్‌ వస్తుందనే విషయం వెల్లడించలేదు.

టెర్మినల్‌ ప్రారంభించి 16 నెలలు పూర్తి

పోర్టు అధికారుల కథనం ప్రకారం క్రూయిజ్‌ టెర్మినల్‌ భవనాన్ని 3,530 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించారు. అందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌ 2,750 చ.మీ. విస్తీర్ణంలో ఉండగా, దానిని ప్రయాణికుల రాకపోకలకు ఉద్దేశించారు. ఈ టెర్మినల్‌ను ఆనుకొని 180 మీటర్ల పొడవైన బెర్త్‌ ఉంది. నాలుగు మూరింగ్‌ డాల్ఫిన్లతో కలిపి బెర్తు పొడవు 330 మీటర్ల వరకు వస్తుంది. దీని వెడల్పు 376. మీటర్లు. డ్రాఫ్ట్‌ 8.1 మీటర్లు. దీంతో పెద్ద పెద్ద క్రూయిజ్‌ షిప్‌లను కూడా తీసుకురావచ్చు.

పార్కింగ్‌లో ఏడు బస్సులు, 70 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు నిలుపుకొనేలా వసతి కల్పించారు. దీనిని కేంద్ర మంత్రి చేతులు మీదుగా 2023 సెప్టెంబరులో ప్రారంభించారు. 16 నెలలు పూర్తయింది. అప్పటి నుంచి బోణీ లేదు. ఒక్క క్రూయిజ్‌ షిప్‌ కూడా రాలేదు. పోర్టు అధికారులకు దానిని ఎలా నిర్వహించాలో తెలియకపోవడమే ప్రధాన కారణమని అంటున్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధులు కొందరు పలు సూచనలు చేయగా వాటిని పట్టించుకోలేదు. ఒక కమిటీని ఏర్పాటుచేసి, క్రూయిజ్‌ సంస్థల వద్దకు వెళ్లి, ఈ ప్రాంతం గురించి, పర్యాటక స్థలాల గురించి, టెర్మినల్‌ సౌకర్యం గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే...కనీసం ఏడాది తరువాతైనా స్లాట్లు ఇస్తారని కొందరు సూచించగా అధికారులు పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో పైనుంచి వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక టెర్మినల్‌ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలని కూడా చూశారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఎవరూ ముందుకురాలేదు. దాంతో పోర్టు యాజమాన్యమే క్రూయిజ్‌ షిప్‌లను తీసుకురావలసిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి విశాఖపట్నం వచ్చి సమావేశం నిర్వహించడంతో విశాఖపట్నం పోర్టు ‘ఆగస్టులో క్రూయిజ్‌’ అంటూ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Jan 25 , 2025 | 01:10 AM