తగ్గని పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:08 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు శుక్రవారం సైతం పర్యాటకులతో కిటకిటలాడాయి.

పండుగ సెలవులతో మన్యం బాట పట్టిన సందర్శకులు
రద్దీగా మారిన పర్యాటక ప్రదేశాలు
చాపరాయి జలవిహారీ కిటకిట
వంజంగి మేఘాల పర్వతానికి పెరిగిన తాకిడి
కళకళలాడిన కొత్తపల్లి జలపాతం
పాడేరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు శుక్రవారం సైతం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంకాంత్రి నేపథ్యంలో వరుస సెలవులు కావడంతో శుక్రవారం సైతం ఆదివారాన్ని తలపించేలా ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు సందర్శనీయ ప్రదేశాలకు తరలి వస్తున్నారు. శుక్రవారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
జలవిహారిలో జనం సందడి
డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలవిహారిలో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పర్యాటకులతో చాపరాయి కిక్కిరిసి పోయింది. ఉదయం మంచు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు మధ్యాహ్నం జలపాతాల్లో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. జలవిహారి చాపరాయి, అంజోడ సిల్క్ ఫాం, ఫినరిలో సెల్ఫీలతో కుటుంబ సమేతంగా పర్యాటకులు ఆనందంగా గడిపారు.
కళకళలాడిన వంజంగి, కొత్తపల్లి
పాడేరురూరల్: పాడేరు మండలం వంజంగి మేఘాల పర్వతానికి శుక్రవారం పర్యాటకుల తాకిడి పెరిగింది. అలాగే జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం పర్యాటకులతో కళకళలాడింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రకృతి ప్రియులతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛతీస్‌గఢ్ తదితర రాష్ట్రాల పర్యాటకులు వందల సంఖ్యలో రావడంతో ఆయా పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. మేఘాల పర్వతంపై సూర్యోదయం వేళ వచ్చే భానుడి కిరణాలు, పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలను తిలకించిన పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. మేఘాల పర్వతం సందర్శన అనంతరం పర్యాటకులు జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి వెళ్లారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు.