పరవాడ ఎంపీడీవో తీరుపై కలెక్టర్ అసహనం
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:20 AM
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒక ఎంపీడీవో తీరుపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు అనుమానం వచ్చింది. తాను అడుగుతున్న ప్రశ్నలకు ఎంపీడీవో పొంతనలేని సమాధానాలు చెబుతుండడం, వారిస్తున్నా వినకపోవడంతో తక్షణం విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

విచారణకు ఆదేశం
రక్త నమూనాలు సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది
మరోవైపు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించిన సీఐ
కార్యాలయ సిబ్బంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్న జడ్పీ డిప్యూటీ సీఈవో
పరవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒక ఎంపీడీవో తీరుపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు అనుమానం వచ్చింది. తాను అడుగుతున్న ప్రశ్నలకు ఎంపీడీవో పొంతనలేని సమాధానాలు చెబుతుండడం, వారిస్తున్నా వినకపోవడంతో తక్షణం విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తెలుగులో సమాధానం చెప్పాలని కలెక్టర్ చెబుతున్నప్పటికీ ఎంపీడీవో తన పంథాను మార్చుకోకుండా ఇంగ్లీషులో మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు సాయంత్రం ఆరు గంటలకు పరవాడ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీవో ప్రవర్తన గురించి అక్కడ అధికారులతో పాటు సిబ్బంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఎంపీడీవోగా శ్యామ్‌సుందర్ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తుంది. ఈ నాలుగు నెలల్లో ఎలా వ్యవహరించారన్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో విధులకు హాజరై, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించేవారని విచారణలో బయటపడినట్టు తెలిసింది.
రక్త నమూనాలను సేకరించిన డీఎం అండ్ హెచ్‌ఓ
కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌ఓ) రవికుమార్ సాయంత్రం ఐదు గంటలకు పరవాడ ఒకటి, రెండు సచివాలయాలకు చెందిన ఏఎన్‌ఎంలతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీవో శ్యామ్‌సుందర్ నుంచి రక్త నమూనాలను సేకరించారు. అప్పటికే సీఐ తన సిబ్బందితో ఎంపీడీవోకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసినట్టు తెలిసింది.