కోడ్ ముగిశాకే..!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:44 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్థి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఈ నెలలో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావించగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

మల్టీ లెవెల్ కారు పార్కింగ్, హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభోత్సవం వాయిదా
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్థి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఈ నెలలో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావించగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ.90 కోట్లు.
వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దూరం నుంచి చూస్తే క్రూయిజ్ షిప్ మోడల్‌లో కనిపించే ఈ భవన నిర్మాణానికి రూ.87.5 కోట్లు ఖర్చు చేశారు. ఇది 11 అంతస్థుల భవనం. బేస్‌మెంట్‌లో మూడు అంతస్థులు, పైన మొదటి, రెండో అంతస్థులు (మొత్తం ఐదు) పార్కింగ్‌కు కేటాయించారు. 430 కార్లు, 400 దిచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. మూడో అంతస్థు నుంచి ఏడో అంతస్థు వరకు (ఐదు అంతస్థులు) ఐటీ సంస్థకు కేటాయిస్తారు. ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు.
రామకృష్ణా బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్ పక్కనే యూహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం నిర్మాణం కూడా చివరి దశకు వచ్చింది. నేవీలో సుమారు పదిహేడేళ్లు సేవలుందించి గత ఏడాది జూన్ 28న ఐఎన్‌ఎస్ డేగాలో డీ కమిషనింగ్ జరిగిన ‘యూహెచ్-3హెచ్’ హెలికాప్టర్‌ను ఇక్కడి మ్యూజియంగా పెడుతున్నారు. దీనికి రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. కాగా ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే తేదీని బట్టి ప్రారంభోత్సవం చేయించాలని వీఎంఆర్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి.