అల్లూరి అనుచరుడి వారసుల ఆవాసాలు సిద్ధం
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:09 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడైన గాం గంటందొర వారసులకు శాశ్వత ఆవాసాలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పూరిళ్లల్లో దుర్భర జీవనం సాగిస్తున్న వీరికి నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ గృహ సముదాయం నిర్మించింది. ఈ నెల 17న వీటిని అందించేందుకు తుది మెరుగులు దిద్దుతుండడంతో గంటందొర వారసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరనున్న ఏళ్లనాటి సొంతింటి కల
ఇన్నాళ్లూ పూరిళ్లల్లో దుర్భర జీవనం
వారి పరిస్థితి తెలిసి చలించిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం
రూ.2 కోట్ల వ్యయంతో గృహ సముదాయాల నిర్మాణం
ఈ నెల 17న గృహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు
గంటందొర వారసుల్లో ఆనందం
కొయ్యూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడైన గాం గంటందొర వారసులకు శాశ్వత ఆవాసాలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పూరిళ్లల్లో దుర్భర జీవనం సాగిస్తున్న వీరికి నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ గృహ సముదాయం నిర్మించింది. ఈ నెల 17న వీటిని అందించేందుకు తుది మెరుగులు దిద్దుతుండడంతో గంటందొర వారసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి అనుచరుడు గాం గంటందొర వారసులైన ఐదుగురు సంతానానికి చెందిన 11 కుటుంబాలు ఇప్పటి వరకు పూరిళ్లల్లో జీవనం సాగిస్తున్నాయి. వీరికి ఏం ప్రభుత్వమూ సాయం చేయలేదు. వీరి పరిస్థితిని హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రస్తుత ఎండీ ఏవీఎస్ రాజు కుమారుడు ఏవీ రంగరాజుకు రెండేళ్ల క్రితం నర్సీపట్నానికి చెందిన క్షత్రీయ సేవా సంఘం ప్రతినిధులు వివరించారు. ఎటువంటి వసతులు లేని పూరిళ్లల్లో వారు నివాసముంటున్నారని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. క్షత్రీయ సేవా సంఘం చొరవతో గంటందొర వారసులు నివాస ముంటున్న బట్టపణుకుల పంచాయతీ లంకవీధి గ్రామానికి ఆనుకుని ఉన్న సుమారు రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2013 నవంబరులో ఏసీసీ కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసి ఆరు కుటుంబాలకు ఒక భవనం, మిగిలిన ఐదు కుటుంబాలకు మరో భవనాన్ని రూ.2 కోట్లతో నిర్మించాలని నిర్ణయించుకుని పనులు ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి రెండు పడకల గదులు, హాలు, కిచెన్‌తో కూడిన వసతిని 1,250 చదరపు అడుగుల్లో నిర్మించారు. 11 కుటుంబాలకు ఇందులో వసతి కల్పించి, మిగిలిన ఒక పోర్షన్‌ను ఆయా కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు వినియోగించుకునేలా క్లబ్‌హౌస్ ఏర్పాటు చేశారు. ఆ గృహ సముదాయాల ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణంలో కడియం నుంచి పూల మొక్కలను తెప్పించి ఉద్యాన వనాన్ని తయారు చేస్తున్నారు. గంటందొర వారసులైన బుచ్చిదొర, లక్ష్మణదొర, బోడిదొర, తెల్లనదొర, సోమన్నదొరలకు చెందిన 11 మంది సంతానమైన గాం పెంటన్నదొర, బాబూరావు, నీలకంఠం, రాంబాబు, దార మల్లేశ్వరి, బోడిదొర, సీతారామయ్య, సీతమ్మ, రాజబాబు, మలయ్మమ్మ, శివలకు ఎట్ట కేలకు శాశ్వత గృహాలు సమకూరనున్నాయి. ఈ నెల 17న కలెక్టర్ చేతుల మీదుగా వీరికి గృహాలు అందించనున్నారు. దీంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.