Share News

ఓటెత్తిన ఉపాధ్యాయులు

ABN , Publish Date - Feb 28 , 2025 | 01:18 AM

విశాఖ జిల్లాలో 5,529 మందికిగాను 4,842 (87.57 శాతం) మంది ఓటు వినియోగించుకున్నారు.

ఓటెత్తిన ఉపాధ్యాయులు

  • ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.4 శాతం పోలింగ్‌

  • అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 96 శాతం, అతి తక్కువగా విశాఖ జిల్లాలో 87.57 శాతం

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్‌ నమోదైంది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా, 20,783 మంది (92.4 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 13,508 మందికి 12,557 మంది, మహిళలు 8,985 మందికి 8,226 మంది ఓటు వేశారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 2,885కి 2,776 (96.22 శాతం) మంది ఓటు వేయగా, అతి తక్కువగా విశాఖ జిల్లాలో 5529కి 4,842 (87.57 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 5,035కి 4,769 (94.72 శాతం), పార్వతీపురం మన్యంలో 2,333కి 2,187 (93.74 శాతం), విజయనగరం జిల్లాలో 5,223కి 3,912 (94.05 శాతం), అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,488కి 1,310 (88.04 శాతం) మంది ఓటు వేశారు. ఆరు జిల్లాల పరిధిలో ఉదయం పది గంటలకల్లా 21.74 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 57.71 శాతం, రెండు గంటలకు 79.54 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసేసరికి 92.4 శాతానికి చేరింది. ఆరు జిల్లాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన స్ర్టాంగ్‌ రూమ్‌కు తరలిస్తున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. కాగా 2019లో జరిగిన ఎన్నికల్లో 90 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ పర్యాయం 2.4 శాతం ఎక్కువగా ఓట్లు పోలైనట్టు అధికారులు చెబుతున్నారు.

పోలింగ్‌ కేంద్రాల సందర్శన

పోటీలో ఉన్న అభ్యర్థులు పాకలపాటి రఘువర్మ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, గాదె శ్రీనివాసులనాయుడు విజయనగరం, అనకాపల్లి, కోరెడ్లె విజయగౌరి విజయనగరం జిల్లాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.

పోలింగ్‌ వివరాలు జిల్లాల వారీగా...

జిల్లా మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం

శ్రీకాకుళం 5,032 4,769 94.72

పార్వతీపురం మన్యం 2,332 2,187 93.74

విజయనగరం 5,223 4,912 94.05

అల్లూరి సీతారామరాజు 1,488 1,310 88.04

విశాఖపట్నం 5,529 4,842 87.57

అనకాపల్లి 2,885 2,776 96.22

మొత్తం 22,493 20,783 92.4

విశాఖ జిల్లాలో 87.57 శాతం

  • 5,529 మందికిగాను ఓటు వినియోగించుకున్నది 4,842 మంది

  • ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 99 శాతం పోలింగ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లాలో 5,529 మందికిగాను 4,842 (87.57 శాతం) మంది ఓటు వినియోగించుకున్నారు. పురుషులు 2,539 మందికి 2,235 మంది (88.02 శాతం), మహిళలు 2,990మందికి 2,607 (87.19 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పద్మనాభంలోని పోలింగ్‌ కేంద్రంలో 85కి 84 మంది (99 శాతం), ఆనందపురంలో 44కి 43 మంది (99 శాతం) ఓటు హక్కు వినియోగించుకోగా...నగరంలోని పలు బూత్‌లలో 80 నుంచి 85 శాతం పోలింగ్‌ జరిగింది. భీమిలిలోని పోలింగ్‌ కేంద్రంలో 261కి 241 మంది (92.3 శాతం), చంద్రంపాలెంలో 908కి 763 మంది (84.03 శాతం), పెందుర్తిలో 954కి 863 (90.46 శాతం), మల్కాపురంలో 166కి 154 మంది (92.77 శాతం), గోపాలపట్నంలో 369కి 341 (92.41 శాతం), ప్రేమ ఉన్నత పాఠశాలలో 265కి 244 మంది (92.08 శాతం), రైల్వేన్యూకాలనీలోని కేఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో 500కి 408 (81.6 శాతం), గాజువాకలో 708కి 614 (86.72 శాతం), నడుపూరులో 101కి 96 (95.05 శాతం) మంది, ఏయూ ప్రాథమిక పాఠశాలలో 747కి 620 (83) కంచరపాలెం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన బూత్‌లో 421కి 371 మంది (88.12 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాలోని 13 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మొదటి గంట కొంత మందకొడిగా సాగింది. తొమ్మిది గంటల తరువాత పుంజుకుంది. ఉదయం పది గంటలకు 21.7 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 44.04 శాతం, రెండు గంటలకు 79.54 శాతం, సాయంత్రం నాలుగు గంటలకు 87.57 శాతం పోలింగ్‌ జరిగింది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటుచేశారు. 144 సెక్షన్‌ అమలుచేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పక్షాన మద్దతుదారులు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతుగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు హెల్ప్‌డెస్క్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉన్నారు.

జిల్లా పరిశీలకుని పర్యటన

ఏయూ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ రైల్వేన్యూకాలనీలో కేఎన్‌ఎం బాలికల పాఠశాలలో కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. కాగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి కలెక్టర్‌ ఆరు జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని పరిశీలించారు.

Updated Date - Feb 28 , 2025 | 01:18 AM