విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:23 AM
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో గల నేషనల్ టాలెంట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం దేహశుద్ధి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేశారు. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేసిన బాలిక కుటుంబీకులు
స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఘటనపై డీఈవో విచారణ
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది జంక్షన్‌లో గల నేషనల్ టాలెంట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం దేహశుద్ధి చేశారు. అనంతరం స్తంభానికి కట్టేశారు. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బుధవారం మధ్యాహ్నం లెక్కల ఉపాధ్యాయుడు దారపు గంగాప్రసాద్ వద్దకు వెళ్లింది. అయితే కొద్దిసేపటి తరువాత రమ్మని చెప్పడంతో సాయంత్రం వెళ్లింది. విద్యార్థిని వెళ్లిన వెంటనే క్లాస్ రూమ్ తలుపులు దగ్గరగా వేసిన ఉపాధ్యాయుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక ఏడుస్తూ బయటకు వచ్చి స్కూల్ ఆయాకు విషయం చెప్పింది. ఈ సమాచారం తెలిసి విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత విద్యార్థిని జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం ఉదయం వారు, వారి కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడు గంగాప్రసాద్ మరో పాఠశాలలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి కొట్టుకుంటూ ఘటన జరిగిన స్కూల్‌కు తీసుకువచ్చి స్తంభానికి కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంగాప్రసాద్‌ను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హోంమంత్రి ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావులు వడ్డాదిలోని ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్ రామరాజు నుంచి వివరాలు సేకరించారు. కాగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు నేషనల్ టాలెంట్ స్కూల్‌తో పాటు, మండలంలోని మరో రెండు స్కూళ్లలో కూడా లెక్కలు బోధిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబీకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.