Share News

నాలా పన్ను ఎగవేత

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:53 AM

నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఎసెస్‌మెంట్‌ యాక్ట్‌) పన్ను కట్టకపోయినా భవన నిర్మాణాలకు గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు.

నాలా పన్ను ఎగవేత

  • భూ వినియోగ మార్పిడికి అనుమతి పొందకుండానే నిర్మాణాలు

  • చోద్యం చూస్తున్న రెవెన్యూ

  • భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసిన జీవీఎంసీ

  • నిర్మాణదారులతో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కుమ్మక్కు

  • రూ.120 కోట్ల మేర ఆదాయం కోల్పోయిన నగర పాలక సంస్థ

  • విజిలెన్స్‌ దృష్టి

  • విచారణ జరుగుతున్నట్టు సమాచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఎసెస్‌మెంట్‌ యాక్ట్‌) పన్ను కట్టకపోయినా భవన నిర్మాణాలకు గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. భవన నిర్మాణదారులతో ముందుగానే అవగాహన కుదుర్చుకుని నాలాతో నిమిత్తం లేకుండానే ప్లాన్‌లు జారీ చేసేస్తున్నారు. నిర్మాణం పూర్తికాగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) మంజూరు చేస్తున్నారు. దీనివల్ల రెవెన్యూ శాఖతోపాటు జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ విధంగా జీవీఎంసీ పరిధిలోనే రూ.120 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్టు ప్రచారం జరుగుతుండడంతో విజిలెన్స్‌ విభాగం విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

గాజువాక, మధురవాడ, భీమిలి పరిసర ప్రాంతాలన్నీ కొన్నాళ్ల కిందట జీవీఎంసీలో విలీనమయ్యాయి. నగర విస్తరణ నేపథ్యంలో శివారున ఉన్న ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాలు పెరుగుతున్నాయి. అయితే అవన్నీ వ్యవసాయ భూములు కావడంతో భవన నిర్మాణాలు చేపట్టాలన్నా, పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకున్నాసరే భూ వినియోగ స్వభావాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం యజమానులు ఆ భూమి విలువలో ఐదు శాతం మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి, ఆ రశీదుతోపాటు భూమి స్వభావాన్ని మార్చాలని కోరుతూ రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్డీవో)కి దరఖాస్తు చేసుకుంటే, ఆయన పరిశీలించి సంబంధిత తహసీల్ధార్‌కు పంపి...క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణంతోపాటు అక్కడ భూమి విలువ ఎంత ఉంది?, నాలా కింద చెల్లించిన మొత్తం సరిపోతుందా?, ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉందా?...వంటివి పరిశీలించిన తర్వాత భూమి వినియోగ స్వభావాన్ని రికార్డుల్లో మార్పు చేసి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఆ తర్వాతే ఆ భూమిలో భవన నిర్మాణాలకు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీ అధికారులు భవన నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ప్రతిపాదిత భూమి/స్థలం వినియోగ స్వభావం నివాసయోగ్యమైనదేనా?, కాదా?..అని పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ నివాసయోగ్యం కాకుండా వ్యవసాయ స్వభావంలోనే ఉంటే మాత్రం నాలా పన్ను చెల్లించాలని ప్లాన్‌ను షార్ట్‌ ఫాల్‌లో పెట్టాల్సి ఉంటుంది. తాను తర్వాత చెల్లిస్తానని జీవీఎంసీ అధికారులకు దరఖాస్తుదారుడు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే ప్రత్యేక పరిస్థితుల్లో భవన నిర్మాణం పూర్తిచేసేలోగా నాలా చెల్లించాలనే షరతుపై ప్లాన్‌ జారీచేయాలి. కానీ నగరంలో చాలాచోట్ల నాలా లేకుండానే వ్యవసాయ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీ పరిధిలో రూ.120 కోట్లు వరకు నాలా బకాయిలు

నాలా పన్ను కట్టకుండా భవన నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆయా యజమానులకు భూమి విలువలో 50 శాతం నుంచి వంద శాతం వరకూ జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారులు నాలా పన్ను చెల్లించకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నా...ఎందుచేతనో పట్టించుకోవడం లేదు. అధికారులు, సిబ్బంది వ్యక్తిగతంగా లబ్ధి పొందుతుండడం వల్లే భవన నిర్మాణాలకు అభ్యంతరం చెప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులు కూడా నాలా పన్ను చెల్లించకపోయినా భవన నిర్మాణాలకు నిరభ్యంతరంగా ప్లాన్‌ జారీచేయడంతోపాటు తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా జారీ చేసేస్తున్నారు. ఉదాహరణకు కూర్మన్నపాలెంలో ఒకరు 9.5 ఎకరాల్లో నిర్మించిన గేటెడ్‌ కమ్యూనిటీకి నాలా పన్ను కింద సుమారు రూ.3.5 కోట్లు కట్టాల్సి ఉంటుంది. కానీ చెల్లించకపోయినా ప్లాన్‌ జారీచేయడంతోపాటు ఇటీవలే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా జారీ చేసేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే మరొకరు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. ఆ భూమికి నాలా పన్ను కింద రూ.1.5 కోట్లు చెల్లించాల్సి ఉన్నా...కట్టలేదని సమాచారం. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు ప్లాన్‌, ఓసీ జారీ చేసేశారు. ఏదైనా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జీవీఎంసీ అధికారులు ఓసీ జారీచేయకపోతే...వాటికి రెవెన్యూ విభాగం అధికారులు వంద శాతం అదనపు పన్ను విధించవచ్చు. తద్వారా జీవీఎంసీకి ఆదాయం పెరుగుతుంది. కానీ నాలా పన్ను కట్టకపోయినా టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఓసీ జారీ చేసేస్తుండడంతో సాధారణ ఆస్తి పన్ను మాత్రమే జీవీఎంసీకి చేరుతోంది. ఈ విధంగా జీవీఎంసీ సుమారు రూ.120 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదులు అందడంతో రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. దీంతో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Updated Date - Feb 15 , 2025 | 12:53 AM