Share News

త్రిశంకు స్వర్గంలో తాండవ షుగర్స్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:35 AM

రెండు జిల్లాల చెరకు రైతులకు ఆరు దశాబ్దాలపాటు జీవనాడిగా వున్న తాండవ షుగర్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వివిధ కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురైన తాండవ షుగర్‌ ఫ్యాక్టరీకి గత వైసీపీ ప్రభుత్వం చేయూత ఇవ్వకపోగా, పూర్తిగా మూసివేయించింది. వేలాది మంది చెరకు రైతులు గత్యంతరం లేక అరకొర ఆదాయం వచ్చే ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తారని రైతులు ఆశిస్తున్నారు.

త్రిశంకు స్వర్గంలో తాండవ షుగర్స్‌
తాండవ చక్కెర కర్మాగారం

హామీని అమలు చేయని వైసీపీ అధినేత

ఆర్థికంగా ఆదుకోకపోవడంతో

ఆ పార్టీ హయాంలోనే మూసివేత

ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి

పాడైపోతున్న యంత్ర సామగ్రి

కార్మికులకు రూ.13.5 కోట్ల బకాయిలు

ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని యువగళంలో నారా లోకేశ్‌ హామీ

కూటమి ప్రభుత్వంపైనే రైతులు, కార్మికుల ఆశలు

వచ్చే సీజన్‌ నాటికి అందుబాటులోకి తేవాలని వినతి

పాయకరావుపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రెండు జిల్లాల చెరకు రైతులకు ఆరు దశాబ్దాలపాటు జీవనాడిగా వున్న తాండవ షుగర్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వివిధ కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురైన తాండవ షుగర్‌ ఫ్యాక్టరీకి గత వైసీపీ ప్రభుత్వం చేయూత ఇవ్వకపోగా, పూర్తిగా మూసివేయించింది. వేలాది మంది చెరకు రైతులు గత్యంతరం లేక అరకొర ఆదాయం వచ్చే ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తారని రైతులు ఆశిస్తున్నారు.

పాయకరావుపేటలో 1962లో ‘తాండవ సహకార చక్కెర కర్మాగారం’ పేరుతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. పదిహేనేళ్ల తరువాత ఆధునికీకరణ పనులు చేపట్టి రోజు వారీ క్రషింగ్‌ సామర్థ్యాన్ని 1,250 టన్నులకు, మళ్లీ 2001లో 1,600 టన్నులకు పెంచారు. పాయకరావుపేట, నర్సీపట్నంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన సుమారు 12 వేల మంది సభ్యరైతులు వున్నారు. 2010వ సంవత్సరం వరకు ఫ్యాక్టరీ సవ్యంగానే నడిచింది. ఆ తరువాత నుంచి పంచదార ఉత్పత్తి వ్యయం కన్నా మార్కెట్‌లో పంచదార అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా వుండడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఏటేటా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో పంచదార విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించడంతో మార్కెట్‌లో పంచదార ధర పెరిగినపుడు అమ్ముకునే వీలులేకపోయింది. దీంతో చెరకు రైతులకు పేమెంట్లు, కార్మికుల వేతనాల చెల్లింపుల కోసం పంచదారను బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు చేయాల్సి వచ్చింది. రానురాను పరిస్థితి మరింత దిగజారిపోయి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోయింది.

వైసీపీ హయాంలో మూసివేత

ఈ నేపథ్యంలో 2019 సాధారణ ఎన్నికలు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలను ఆర్థికంగా ఆదుకుని అభివృద్ధికి కృషిచేస్తామని పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత సహకార చక్కెర కర్మాగారాలపై అధ్యయనం పేరుతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు తప్ప ఎటువంటి సాయం అందజేయలేదు. మరోవైపు చెరకు మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు డబ్బులను ఆలస్యంగా ఇస్తుండడంతో రైతులు క్రమేపీ చెరకు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఫ్యాక్టరీపై ఇది మరింత ప్రతికూల ప్రభావం చూపింది. ఒకప్పుడు లక్ష టన్నులకుపైగా చెరకు క్రషింగ్‌ చేసిన తాండవ ఫ్యాక్టరీ.. 2020-21 సీజన్‌లో 40 వేల టన్నులకు పడిపోయింది. ఫ్యాక్టరీ యంత్రాలు పాతబడిపోవడంతో పంచదార రికవరీ శాతం తగ్గిపోయి, రైతులకు ప్రోత్సాహకం అందని పరిస్థితి నెలకొంది. అప్పటికి ప్యాక్టరీ రూ.40 కోట్ల నష్టాలకు చేరుకుంది. మరోవైపు రైతులకు రూ.11 కోట్లు, కార్మికులకు వేతన బకాయిలు రూ.10 కోట్లు చెల్లించాల్సి వుంది. ఈ సమయంలో రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం.. తాండవ షుగర్స్‌ను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో చెరకు రైతులకు బకాయిలు పేరుకుపోయాయి. దిక్కుతోచని స్థితిలో వున్న ఫ్యాక్టరీ యాజమాన్యం 2021-22 క్రషింగ్‌ సీజన్‌ నుంచి ఫ్యాక్టరీని మూసివేసింది. రైతులు ఏడాదిన్నరపాటు ఆందోళనలు చేయగా చెరకు బకాయిల కోసం ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. బకాయిల చెల్లింపు, ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడం కోసం యాజమాన్యం, కార్మికులు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి, మంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆదుకుంటామని హామీ ఇవ్వడమే తప్ప కార్యరూపం దాల్చలేదు. తరువాత రెండేళ్లపాటు అధికారంలో వున్నప్పటికీ వైసీపీ పాలకులు మాటలతో మభ్యపెట్టారు తప్ప ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టలేదు.

ఉపాధి లేక.. బకాయిలు అందక..

ఫ్యాక్టరీలో ఫుల్‌ టైమ్‌, సీజనల్‌ ఎన్‌ఎంఆర్‌లుగా సుమారు 300 మంది కార్మికులు పనిచేసేవారు. ఫ్యాక్టరీ మూతపడడంతో వీరంతా రోడ్డున పడ్డారు. వేతన బకాయిలు, పీఎఫ్‌ బకాయిలు, రిటైర్‌ అయిన వారికి గ్రాట్యుటీ వగైరా కలిపి రూ.13.5 కోట్ల వరకు వీరికి అందాల్సి వుంది. ఫ్యాక్టరీ మూతపపడంతో కుటుంబాలను పోషించుకోవడానికి భవన నిర్మాణ కార్మికులుగా, షాపులు, హోటళ్లలో వర్కర్లుగా పనులకు వెళుతున్నారు. మరోవైపు నాలుగేళ్ల నుంచి ఫ్యాక్టరీ రన్నింగ్‌లో లేకపోవడంతో యంత్రాలు తుప్పపట్టి పాడైపోతున్నాయి. ఫ్యాక్టరీని తిరిగి తెరవాలంటే చాలా వరకు యంత్రాలు, పరికరాలను మార్చాల్సి వుంటుంది. దీనిపై ఫ్యాక్టరీ ఎండీ ప్రసాదరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కార్మికుల వేతన బకాయిల చెల్లింపు కోసం రూ.13.5 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞాపన పంపామని, చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఫ్యాక్టరీ భవిష్యత్తు ఆధారపడి వుందన్నారు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

యువగళం పాదయాత్రంలో భాగంగా 2023 డిసెంబరు రెండో వారంలో పాయకరావుపేట వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్‌.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాండవ షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత కూడా లోకేశ్‌ పక్కనే వున్నారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు ఈ విషయాన్ని గుర్తు చేసుకుని, షుగర్‌ ఫ్యాక్టరీని వచ్చే క్రషింగ్‌ సీజన్‌ (2025-26) నాటికి అయినా తెరిపించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:35 AM