డీసీఏవో గోవిందరావు సస్పెన్షన్
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:17 AM
అనకాపల్లి జిల్లా సహకార ఆడిట్ అధికారి (డీసీఏవో) జి.గోవిందరావును సస్పెండ్ చేస్తూ సహకార శాఖ కమిషనర్/రిజిస్ట్రార్ ఎ.బాబు ఉత్తర్వులు జారీచేశారు. అనకాపల్లిలో డీసీఏవో కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు విరాళాలు సేకరించినట్టు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన విచారణ మేరకు చర్యలు తీసుకున్నారు.

జిల్లా కార్యాలయంలో ఫర్నీచర్ కోసం విరాళాల వసూలు
ఒక్కో సొసైటీ నుంచి రూ.5-10 వేలు సేకరణ
డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా డబ్బులు పంపిన సిబ్బంది
సహకార కమిషనర్‌కు ఫిర్యాదు
జాయింట్ రిజిస్ట్రార్‌తో విచారణ
విరాళాల సేకరణ వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా సహకార ఆడిట్ అధికారి (డీసీఏవో) జి.గోవిందరావును సస్పెండ్ చేస్తూ సహకార శాఖ కమిషనర్/రిజిస్ట్రార్ ఎ.బాబు ఉత్తర్వులు జారీచేశారు. అనకాపల్లిలో డీసీఏవో కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు విరాళాలు సేకరించినట్టు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన విచారణ మేరకు చర్యలు తీసుకున్నారు.
అనకాపల్లిలోని జిల్లా సహకార ఆడిట్ అధికారి కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్‌ను సమకూర్చుకునేందుకు డీసీఏవో గోవిందరావు, జిల్లాలో 74 ప్రాఽథమిక సహకార సంఘాల నుంచి విరాళాలు అడిగారు. ఈ విషయాన్ని ఫోన్‌లో మేసేజ్ చేశారు. సంఘం స్థోమతనుబట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సొమ్ములు సేకరించారు. కొంతమంది ఆడిట్ సిబ్బంది విరాళాల సొమ్మును డీసీఏవోకు, కార్యాలయంలో సిబ్బందికి ఫోన్‌పే చేశారు. ఈ వివరాలను కొందరు ఆడిటర్లు/సహకార సిబ్బంది, జానకిరాంపురం అభ్యుదయ సంఘం, ఇతర ఉద్యోగులు సహకార శాఖ ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కమిషనర్ విచారణకు ఆదేశించారు. జాయింట్ రిజిస్ట్రార్ ఎన్.రాధికా మాధవి అనకాపల్లి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం కమిషనర్/రిజిస్ట్రార్‌కు నివేదిక ఇచ్చారు. డీసీఏవో కార్యాలయంలో ఫర్నీచర్ కొనుగోలుకు విరాళాలు సేకరించినట్టు నిర్ధారణ కావడంతో డీసీఏవో గోవిందరావును సస్పెండ్ చేశారు. ఈ బాధ్యతలను తాత్కాలికంగా అనకాపల్లి డీసీవో ప్రేమ స్వరూపరాణికి అప్పగించారు. ఇదిలావుండగా సహకార సంఘాల నుంచి విరాళాలు సేకరించి డీసీఏవోకు పంపిన ఆడిటర్లు/ఇతర సిబ్బందిపై మాత్రం చర్యలు లేకపోవడం గమనార్హం. ఆ దిశగా ఎందుకు విచారణ చేయలేదు? ఆమెపై ఒత్తిళ్లు వచ్చాయా? అన్నది ఉన్నతాధికారులు విచారణ చేయాల్సి ఉంది.