గ్యాప్ ఏరియా ఏడు వేల ఎకరాలు సర్వే చేసి నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:50 PM
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారు కొత్తదద్దుగుల దగ్గర ఉన్న ఏడు వేల ఎకరాల గ్యాప్ ఏరియాను రెవెన్యూ అధికారులు నెల రోజు ల్లో సర్వే చేసి సరిహద్దులను నిర్ణయించి తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ వేణుగోపాల్, మండల సర్వేయర్ ప్రసాద్‌లను కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశం
నాతవరం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారు కొత్తదద్దుగుల దగ్గర ఉన్న ఏడు వేల ఎకరాల గ్యాప్ ఏరియాను రెవెన్యూ అధికారులు నెల రోజు ల్లో సర్వే చేసి సరిహద్దులను నిర్ణయించి తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ వేణుగోపాల్, మండల సర్వేయర్ ప్రసాద్‌లను కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశించారు. సోమవారం ఆమె నాతవరం మండలం శృంగవరం పెడిమికొండ దగ్గరల్లో ఉన్న భూములను, అలాగే కొత్తదద్దుగుల వద్ద ఉన్న గ్యా్‌ప్ ఏరియాను పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ డ్రోన్ సర్వే చేస్తేనే త్వరగా గ్యాప్ ఏరియా సర్వే పూర్తవుతుందని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు నాతవరం మండలంలో ఐదో షెడ్యూల్‌లో ఉన్న సుందరకోట, తదితర గ్రామాలను పాడేరు ఐటీడీఎలో విలీనం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈ గ్రామాలు కొయ్యూరు సమితిలో ఉండేవని, అనంతరం నాతవరం మండలంలో కలిపిన తరువాత పాడేరు ఐటీడీఏ ప్రయోజనాలు అందడం లేదన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్య తమ పరిశీలనలో ఉందన్నారు. కొత్తదద్దుగుల గ్రామానికి ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదని, పురిటినొప్పులు వచ్చినప్పుడు వైద్యం కోసం గర్భిణులు చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొత్తదద్దుగులలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల ఉన్నాయా?, లేదా? అని కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. తమ గ్రామంలో అంగన్‌డీ కేంద్రం ఉందని, పాఠశాల లేకపోవడంతో దూరంలో ఉన్న సుందరకోట పాఠశాలకు పిల్లలను పంపిస్తున్నట్టు గిరిజనులు తెలిపారు. ఇక్కడ గిరిజనులు ఏయే పంటలు పండిస్తారని అడగగా, జాఫ్రా, జీడిమామిడి పంటలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వలేదని, వీరికి పట్టాలు ఇవ్వాలని కోరారు. అనంతరం శృంగవరం పెడిమికొండ ఫారెస్టు దగ్గరలో ఎస్‌ఈజడ్ ఏర్పాటుకు 100 ఎకరాలు అవసరం కావడంతో కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆ వివరాలను తహసీల్దార్ వేణుగోపాల్‌ను అడగగా, ఈ ప్రాంతంలో 70 ఎకరాలు జిరాయితీ భూములు, 50 ఎకరాలు డి. పట్టాభూములు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్‌డీవో వీవీ రమణ, మండల సర్వేయర్ ప్రసాద్, స్థానిక రెవెన్యూ అధికారి హరి, తదితరులు పాల్గొన్నారు.