Share News

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:29 PM

ఇంటర్‌ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయన ప్రారంభించారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పిలుపు

పాడేరు జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

జిల్లా వ్యాప్తంగా 20 కళాశాలల్లో 2,900 మంది విద్యార్థులకు లబ్ధి

పాడేరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ.. నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. మధ్యాహ్న భోజన పథకంతో ఇంటర్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 20 జూనియర్‌ కళాశాలల్లో 2,900 మంది ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అలాగే జూనియర్‌ కశాశాలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యార్థులకు హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించి, తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో పి. బ్రహ్మజీరావు, ఎంపీపీ రత్నకుమారి, వైస్‌ ఎంపీపీ గంగపూజారి శివకుమార్‌, జీసీసీ డైౖరెక్టర్లు బొర్రా నాగరాజు, వంపూరు గంగులయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:29 PM