Share News

జిల్లాలో స్టేట్‌ హైవే

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:13 AM

ఐదేళ్ల నుంచి వాహనదారులకు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకంగా తయారైన బీఎన్‌ రోడ్డు (భీమునిపట్నం-నర్సీపట్నం)కు మహర్దశ పట్టనున్నది. కూటమి ప్రభుత్వం దీనిని ‘స్టేట్‌ హైవే’గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అభివృద్ధి చేయనున్న జాబితాలో చేర్చింది. సబ్బవరం నర్సీపట్నం వరకు సుమారు 80 కిలోమీటర్ల రహదారికి అభివృద్ధికి మరో మూడు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు సమాచారం. పనులు పూర్తయిన తరువాత జాతీయ రహదారుల తరహాలోనే ఈ రోడ్డులో కూడా టోల్‌ ఫీజు వసూలు చేస్తారు.

జిల్లాలో స్టేట్‌ హైవే
చోడవరంలో పూర్తిగా ఛిద్రమైన రహదారి

సబ్బవరం టు నర్సీపట్నం.. వయా చోడవరం

రెండు లేన్లుగా అభివృద్ధి

పీపీపీ విధానంలో నిర్మాణం

తొలి దశ ప్యాకేజీ-2లో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం

మూడు నెలల్లో టెండర్ల ప్రకియ

వాహనదారులు, ప్రయాణికులకు తీరనున్న ఇక్కట్లు

చోడవరం, ఫిబ్రవరి 16: ఐదేళ్ల నుంచి వాహనదారులకు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకంగా తయారైన బీఎన్‌ రోడ్డు (భీమునిపట్నం-నర్సీపట్నం)కు మహర్దశ పట్టనున్నది. కూటమి ప్రభుత్వం దీనిని ‘స్టేట్‌ హైవే’గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అభివృద్ధి చేయనున్న జాబితాలో చేర్చింది. సబ్బవరం నర్సీపట్నం వరకు సుమారు 80 కిలోమీటర్ల రహదారికి అభివృద్ధికి మరో మూడు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు సమాచారం. పనులు పూర్తయిన తరువాత జాతీయ రహదారుల తరహాలోనే ఈ రోడ్డులో కూడా టోల్‌ ఫీజు వసూలు చేస్తారు.

వాహనాల రద్దీ అధికంగా వుంటే ఆర్‌అండ్‌బీ రహదారులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్టేట్‌ హైవేలుగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన రహదారులను మొత్తం ఎనిమిది ప్యాకేజీలుగా విభజించింది. ఇందులో అనకాపల్లి జిల్లాలో భీమునిపట్నం- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డుకు చోటు లభించింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం-పార్వతీపురం, అనకాపల్లి జిల్లాలో సబ్బవరం నుంచి చోడవరం, వడ్డాది, కొత్తకోట మీదుగా నర్సీపట్నం వరకు ఆర్‌అండ్‌బీ రహదారులను స్టేట్‌ హైవేలుగా అభివృద్ధి చేయాలని రెండో ప్యాకేజీలో చేర్చారు. ఈ రెండు రహదారులను రూ.480 కోట్లతో రెండు వరుసలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకు సంబంధించి మరో మూడు నెలల్లో టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉందని అఽధికారవర్గాల సమాచారం. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద నిర్మాణ వ్యయంలో 20 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్రం ఇస్తాయి. మిగిలిన మొత్తం కాంట్రాక్టు కంపెనీ భరించాలి. గోవాడ, వడ్డాది, విజయరామరాజుపేట తదితర ప్రాంతాల్లో నదులపై కొత్తగా వంతెనలు నిర్మిస్తారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. రహదారి నిర్మాణం పూర్తయిన తరువాత టోల్‌ ప్లాజాలను ఏర్పాటు చేసి, టోల్‌ ఫీజు వసూలును కాంట్రాక్టు కంపెనీకి అప్పగిస్తారు. స్టేట్‌ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వాహనాలు సైతం పాడవుకుండా వుంటాయి.

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం

వాస్తవానికి బీఎన్‌ రోడ్డు ఎన్నో ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది. ఎట్టకేలకు 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధికి రూ.119 కోట్లు కేటాయించింది. ఇందులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 70 శాతం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) నుంచి రుణంగా తీసుకోవాలి. టెండర్లు సైతం ఖరారయ్యాయి. పనులు మొదలుపెట్టిన తరువాత వైసీసీ అధికారంలోకి వచ్చింది. సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే పనులు పూర్తయిన అనంతరం ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సు కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్‌డీబీ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం నిధులు విడుదల చేసిన తరువాతే రుణం నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. ఐదేళ్లపాటు ఇదే తంతు నడిచింది. రహదారి మరింత అధ్వానంగా తయారవడంతో ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. బీఎన్‌ రోడ్డులో భాగమైన సబ్బవరం- నర్సీపట్నం (వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట) రహదారిని పీపీపీ విధానంలో రెండు లేన్లుగా అభివృద్ధికి చర్యలు చేపట్టింది.

Updated Date - Feb 17 , 2025 | 12:13 AM