Share News

శరవేగంగా వాటర్‌ గ్రిడ్‌ పనులు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:54 PM

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు ఊపందుకున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ఈ పనులను ప్రారంభించినా గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.

శరవేగంగా వాటర్‌ గ్రిడ్‌ పనులు
అనకాపల్లి మండలం తగరంపూడిలో వాటర్‌గ్రిడ్‌ పథకంలో భాగంగా నిర్మిస్తున్న నీళ్ల ట్యాంకు

ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు

గత వైసీపీ ప్రభుత్వంలో పడకేసిన జల్‌ జీవన్‌ పనులు

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో బ్రేక్‌

జల్‌ జీవన్‌ పథకాన్ని వాటర్‌ గ్రిడ్‌గా మార్చి పనులు వేగవంతం చేసిన కూటమి ప్రభుత్వం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు ఊపందుకున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ఈ పనులను ప్రారంభించినా గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జల్‌ జీవన్‌ మిషన్‌ పథకానికి వాటర్‌ గ్రిడ్‌ పథకంగా పేరు మార్పు చేసి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది.

జిల్లాలోని 572 పంచాయతీల్లో 15 లక్షలకు పైగా జనాభా ఉండగా, జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.552 కోట్ల అంచనా వ్యయంతో 1,615 పనులు చేపట్టాల్సి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.237 కోట్లు ఖర్చు చేసి 928 పనులు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 687 పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. జిల్లాలో 4.17 లక్షల కుటుంబాలు ఉండగా, 2.64 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇంటింటికీ కొళాయిలు అమర్చారు. చాలా గ్రామాల్లో వాటి ద్వారా కూడా సక్రమంగా నీరు సరఫరా జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో పైపులు ఆరుబయట వదలేశారు. ట్యాంకుల నిర్మాణాలు అరకొరగానే చేపట్టి మధ్యలో వదిలేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి, కశింకోట మండలాల్లో రూ.28 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 182 నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందులో కేవలం 94 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 88 పనులు వివిధ దశల్లో ఉండిపోయాయి.

మళ్లీ వాటర్‌ గ్రిడ్‌ దిశగా అడుగులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల్‌ జీవన్‌ మిషన్‌ పథకానికి వాటర్‌ గ్రిడ్‌ పథకంగా పేరు మార్పు చేసి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని అమలు చేసింది. మండలం, గ్రామ పంచాయతీలను యూనిట్‌గా తీసుకొని క్లస్టర్లుగా విభజించి ఇంటింటికీ సురక్షిత తాగునీరు కొళాయిల ద్వారా అందించింది. ఇప్పుడు మళ్లీ జిల్లాలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయితో పాటు రోజుకు తలసరి 55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా సమీపంలోని జలాశయాల నుంచి క్లస్టర్లలో ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకులకు నీరు సరఫరా చేసి ఆయా ట్యాంకుల ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా నీరు సరఫరా చేయనుంది. వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు రూ.300 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి వేగవంతం చేసింది. జిల్లా గ్రామీణ నీటి సరఫరాల శాఖాధికారులు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గతంలో తుది దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. గతంలో అరకొరగా పనులు నిలిచిన వాటర్‌ ట్యాంకులను పూర్తి చేసి, ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు ఇచ్చేందుకు పనులు వేగవంతం చేశారు. జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద ప్రారంభించిన నిర్మాణ పనులను ఏప్రిల్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌ గ్రిడ్‌ పనులు త్వరితగతిన పూర్తయితే తమ తాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:54 PM