మెడికల్ కాలేజీలో పోస్టులకు విశేష స్పందన
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:26 PM
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన నిరుద్యోగులతో మెడికల్ కాలేజీలో సోమవారం హడావిడి నెలకొంది.

బారులు తీరిన నిరుద్యోగులు
29 విభాగాల్లో మొత్తం 244 పోస్టుల భర్తీకి చర్యలు
10వ తేదీతో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ గడువు
పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసేందుకు వచ్చిన నిరుద్యోగులతో మెడికల్ కాలేజీలో సోమవారం హడావిడి నెలకొంది. స్థానిక మెడికల్ కాలేజీలో పారామెడికల్, సపోర్టింగ్ సిబ్బంది కలిపి మొత్తం 244 పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఇటీవల నోటిషికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 244 పోస్టుల్లో కాంట్రాక్ట్ విధానంలో 107, అవుట్ సోర్సింగ్ విధానంలో 137 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు గతేడాది డిసెంబరు 31 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. అయితే నూతన సంవత్సర వేడుకలు, ఆదివారం సెలవు వంటి కారణాలతో సోమవారం నాడు అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చి తమ ఆసక్తి మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తులు సమర్పించారు. దీంతో స్థానిక మెడికల్ కాలేజీలో నిరుద్యోగ అభ్యర్థులతో హడావిడి నెలకొంది. ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసేందుకు ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనుండడంతో రానున్న మూడు రోజులు సందడి వాతావరణం నెలకొనే అవకాశముంది.