ఇకపై సాఫీగా ప్రయాణం
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:34 PM
ఐదేళ్లుగా గోతుల రోడ్లతో ఇబ్బందులు పడిన వాహనచోదకులకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపశమనం లభించిం ది. ప్రస్తుతం కొయ్యూరు నుంచి కాకరపాడు కూడలి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాహన చోదకుల కష్టాలు తీరాయి.

ఐదేళ్లుగా గోతులతో అధ్వానంగా ఉన్న కొయ్యూరు- కాకరపాడు రోడ్డు
పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
కూటమి సర్కారు రావడంతో తీరిన కష్టాలు
రూ.15 లక్షలు మంజూరు చేయడంతో చకచకా మరమ్మతు పనులు
రోడ్డు అంచుల విస్తరణ, గుంతలకు ప్యాచ్ వర్క్
వాహనచోదకులకు తప్పిన అవస్థలు
కొయ్యూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా గోతుల రోడ్లతో ఇబ్బందులు పడిన వాహనచోదకులకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపశమనం లభించిం ది. ప్రస్తుతం కొయ్యూరు నుంచి కాకరపాడు కూడలి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాహన చోదకుల కష్టాలు తీరాయి.
కొయ్యూరు నుంచి కాకరపాడు జాతీయ రహదారిని కలిపే ఆర్ అండ్ బీ రోడ్డు గత ఐదేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రహదారి పొడవునా కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ రహదారిపై ఎదురెదురుగా వాహనాలు వస్తే ఏదో ఒకటి ప్రమాదం బారిన పడే పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రహదారి మరమ్మతులకు గత సంవత్సరం డిసెంబరులో రూ.15 లక్షలు కేటాయించింది. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర రహదారికి మరమ్మతులు చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ జేఈ జయరాజు పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోతకు గురైన అంచులు రెండు పక్కల మరో మూడు అడుగులు విస్తరించి మెటల్ వేసి బీటీరోడ్డు వేశారు. దాని అంచులు కోతకు గురికాకుండా మరో రెండు అడుగులు గ్రావెల్‌తో కప్పారు. నాలుగు కిలోమీటర్లు పొడవునా రోడ్డు మధ్యలో పడిన గుంతలకు అతుకులు వేశారు. మరో రెండు రోజులలో ఈ రహదారి మరమ్మతులు పూర్తి కానుండడంతో వాహనచోదకులు, ఈ ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.