నగరంపై మంచుదుప్పటి
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:14 AM
నగరం, పరిసర ప్రాంతాలను శుక్రవారం పొగమంచు కప్పేసింది. తెల్లవారు జాము నుంచి ఉదయం ఎనిమిది, కొన్నిచోట్ల పది గంటల వరకూ మంచు కురిసింది.

ఉదయం పది గంటల వరకూ ప్రభావం
శివారు ప్రాంతాల్లో 100 మీటర్లు, ఎయిర్‌పోర్టులో 500 మీటర్ల కంటే తక్కువగా విజిబిలిటీ
విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
నగరం, పరిసర ప్రాంతాలను శుక్రవారం పొగమంచు కప్పేసింది. తెల్లవారు జాము నుంచి ఉదయం ఎనిమిది, కొన్నిచోట్ల పది గంటల వరకూ మంచు కురిసింది. పనులపై రోడ్లపైకి వచ్చినవారు ఇబ్బందిపడ్డారు. వాహన చోదకులు ఉదయం ఎనిమిది గంటల వరకూ లైట్లు వేసుకుని నడపాల్సి వచ్చింది. మంచు ప్రభావంతో ఎయిర్‌పోర్టు రన్‌వేపై విజిబిలిటీ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య 500 మీటర్లకు, వాల్తేరు తుఫాన్ హెచ్చరిక కేంద్రం వద్ద 700 మీటర్లకు పడిపోయింది. శివారు ప్రాంతాల్లో 100 మీటర్ల కంటే తక్కువకు విజిబిలిటీ పడిపోయిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ సీజన్‌లో పొగమంచు కురుస్తుందని, అయితే శుక్రవారం దాని తీవ్రత పెరిగిందన్నారు. ఇటువంటి సమయాల్లో వాహనాలు నడిపైవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రెండు రోజల్లో పొగమంచు ప్రభావం ఉంటుందన్నారు.
కాలుష్యంలో ‘పూర్’ కేటగిరీగా నమోదు
పొగమంచు ప్రభావంతో నగరంలో కాలుష్యం తీవ్రత పెరిగింది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంపై ఉన్న యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్‌లో పీఎం-2.5 పూర్ కేటగిరీగా నమోదైంది. గడచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న మంచుకు ధూళి కణాలు పైకి పోకుండా భూమికి తక్కువ ఎత్తులోనే ఉండిపోవడంతో నగరంలో కాలుష్యం పెరిగిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాలుష్యం పెరిగిన నేపథ్యంలో పొగమంచు కురిసే సమయంలో ఆరుబయట తిరిగితే ఊపిరితిత్తుల సమస్య వస్తుందన్నారు. ఇంకా గొంతు నొప్పి, జలుబు చేసి జ్వరాల బారినపడతారని హెచ్చరించారు. ఆస్తమా, ఇస్నోఫీలియా వంటివి ఉన్నవారు మాస్క్‌లు ధరించాలని సూచించారు.