Share News

మందగించిన ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వరి కోతల సమయంలో, అనంతరం అకాల వర్షాలు కురవడం, నూర్పులు ఆసల్యంగా మొదలు కావడం, సంక్రాంతి పండుగ రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. వీటికితోడు ధాన్యంలో తేమ శాతం అధికంగా వుందంటూ పౌరసరఫరాలు, ఇతర శాఖల సిబ్బంది సేకరణకు విముఖత చూపడం కూడా ఒక కారణంగా తెలుస్తున్నది. మొత్తం మీద ఇంతవరకు లక్ష్యంలో మూడో వంతు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

మందగించిన ధాన్యం కొనుగోళ్లు
కె.కోటపాడు మండలం గవరపాలెంలో ధాన్యం సేకరిస్తున్న సిబ్బంది

తేమ అధికంగా ఉందంటూ సేకరణకు విముఖత చూపుతున్న సిబ్బంది

17 శాతానికి మించకూడదని ప్రభుత్వ నిబంధన

25 శాతం వరకు వుండడంతో కొనుగోళ్లకు నిరాకరణ

వాతావరణ పరిస్థితులే కారణమంటున్న రైతులు

తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయం

అనకాపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వరి కోతల సమయంలో, అనంతరం అకాల వర్షాలు కురవడం, నూర్పులు ఆసల్యంగా మొదలు కావడం, సంక్రాంతి పండుగ రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. వీటికితోడు ధాన్యంలో తేమ శాతం అధికంగా వుందంటూ పౌరసరఫరాలు, ఇతర శాఖల సిబ్బంది సేకరణకు విముఖత చూపడం కూడా ఒక కారణంగా తెలుస్తున్నది. మొత్తం మీద ఇంతవరకు లక్ష్యంలో మూడో వంతు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.

గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 56,410 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 92 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రైతుల కుటుంబ అవసరాలు, వచ్చే సీజన్‌లో పంట వేయడానికి అవసరమైన విత్తనాలు, ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలుపోను కనీసం 30 వేల టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాలో 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాస్తవంగా నవంబరు చివరి నుంచే ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి. అయితే గత ఏడాది ఖరీఫ్‌లో వరినాట్లు ఆలస్యం కావడం, పంట కోతకు వచ్చిన సమయంలో సుమారు మూడు వారాలపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు, తుఫాన్‌ కారణంగా వర్షాలు పడడంతో వరి కోతలు, నూర్పుల పనులకు ఆటంకం కలిగింది. వారం నుంచి పది రోజుల వరకు ఆలస్యంగా కోతలు కోశారు. వాతావరణం మసుగ్గా వుండడంతో వరి పనులు ఆరడానికి ఎక్కువ రోజులు పట్టింది. దీంతో కుప్ప, నూర్పుల పనులు కూడా జాప్యం అయ్యాయి. మొత్తం మీద డిసెంబరు రెండో వారం నుంచి వరి నూర్పిడి పనులు మొదలయ్యాయి. చివరి వారం నుంచి ఊపందుకున్నాయి. ఈ కారణాల వల్ల రైతులు ధాన్యం అమ్ముకోవడం ఆస్యమైంది. ఆ ప్రభావం పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణపై పడింది. గురువారం సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో 9,192 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సంక్రాంతి పండుగ కారణంగా గత ఆదివారం నుంచి వరి నూర్పు పనులు దాదాపు ఆగిపోయాయి. ఐదు రోజుల తరువాత శుక్రవారం నుంచి నూర్పులు మొదలుపెట్టారు.

అధిక తేమ శాతంతో సమస్య

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతంకన్నా తక్కువ వుండాలి. అయితే వరి పంట కోతకు వచ్చిన సమయంలో వర్షాలు పడడంతో వడ్ల గింజల్లో శాతం అధికంగా వుంది. కోత కోసిన తరువాత మంచు దట్టంగా కురవడంతో వరి పనలు ఆరడానికి ఎక్కువ రోజులు పట్టింది. ఆరిన పనలను కుప్ప వేసిన తరువాత వెసులుబాటు చూసుకుని రైతులు నూర్పులు చేపట్టారు. అయితేప్పటికీ ధాన్యంలో తేమ 25 శాతం వరకు వుంటున్నది. కానీ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 కన్నా తక్కువ ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు వర్తకులకు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తున్నది.

లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ

జయంతి, డీఎం, జిల్లా పౌరసరఫరాల సంస్థ

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 72 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 9,192 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఎనిమిది వేల టన్నులకు సంబంధించి ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశాం. సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా ధాన్యం కొనుగోళ్లు కాస్త మందగించాయి. రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేస్తాం. లక్ష్యం మేరకు ధాన్యాన్ని సేకరిస్తాం.

Updated Date - Jan 18 , 2025 | 12:10 AM